వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాల తీవ్రత తగ్గడం లేదు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద ప్రవాహం కారణంగా కడప జిల్లాలో ప్రధాన డ్యాములు నిండిపోయాయి. ఆ క్రమంలోనే అన్నమయ్య డ్యామ్ కట్ట కూడా తెగిపోయింది. కడప జిల్లాలో రాంజంపేట వద్ద చెయ్యేరు నది మీద నిర్మించిన ఈ డ్యామ్ కట్ట తెగిపోవడం గమనిస్తే వరద తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా అనంతపురం,చిత్తూర్, కడప జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం పెరుగుతోంది. దాంతో పెన్నా నదీ తీర ప్రాంత వాసులంతా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెన్నా ఉధృతి పెరిగే ప్రమాదం ఉంది.
తొలుత చిత్తూరు జిల్లాలో పింఛా డ్యామ్ కట్ట తెగింది. చెయ్యేరు డ్యామ్ కూడా నీటమునిగింది. నందలూరు మండలంలోని పలు గ్రామాలు నీటిపాలయ్యాయి. పింఛా డ్యాం తెగడంతో ఒక్క సారిగా 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో రాజంపేట, నందలూరు మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. ఆ తర్వాత అన్నమయ్య డ్యామ్ కట్ట కూడా తెగిపోయింది. దాంతో మరింత ముప్పు ఏర్పడింది.
Also Read:రైతుకు చేయూత.. అన్నమయ్య సామర్థ్యం పెంపు..
ఒక్కసారిగా పెరిగిన వరద తాకిడితో చాలామంది చెల్లాచెదురయ్యారు. వరద కారణంగా అనేక మంది ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులే కొన్ని చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న కొండలు లేదా అందుబాటులో వున్న డాబాలపై అనేక మంది తలదాచుకున్నారు. ఇక పులివెందుల పరిధిలో ఉన్న పాపాఘ్ని నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల వారు అలెర్ట్ గా వుండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గాలివీడు ప్రాంతంలో పాపాఘ్ని నది పుడుతుంది. పాపాఘ్ని మీద వెలిగల్లు వద్ద డ్యాం ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి లక్షన్నరకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం సాగుతోంది. కమలాపురం వద్ద అది పెన్నాలో కలుస్తుంది.
రాయచోటి ప్రాంతంలో మాండవ్య నది పుడుతుంది. గడికోట తరువాత అటవీ ప్రాంతంలో అది చెయ్యేరు నదిలో కలుస్తుంది.మదనపల్లి ప్రాంతంలో బహుదా నది పుట్టింది. పీలేరు ప్రాంతంలో పింఛా పుట్టింది. రాయవరం దగ్గర పింఛా నది బహుదాలో కలుస్తుంది .గుంజేరు వాగు పొత్తపి సమీపంలో చెయ్యేరులో కలుస్తుంది.ఇన్ని ఉపనదులు కలవటంతో చెయ్యేరు ప్రవాహం గతంలో ఎప్పుడూ లేనంతగ ఉధృతంగా సాగుతోంది. అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఈ చెయ్యేరు మీద నిర్మించారు. ప్రస్తుతం అక్కడ డ్యామ్ కట్ట తెగడం తో ప్రవాహం వేగంగా కనిపిస్తోంది. చెయ్యేరు జలాలు సోమశిల బ్యాక్ వాటర్ ని చేరి పెన్నానదిలో కలుస్తాయి.
Also Read: నిండుకుండల్లా సీమ ప్రాజెక్టులు – పొంగిపొర్లుతున్న పెద్దేరు
మరో వైపు కర్ణాటకలో పడుతున్న వర్షాలకు ఎగువ పెన్నా ప్రాంతంలో వరద వస్తుంది.పావగడ సమీపంలోని నాగలమడక పొంగిపొర్లుతోంది. దీనితో అప్పర్ పెన్నా (పెరూర్) ప్రాజెక్ట్ కు వరద వస్తుంది. మరో వైపు చిత్రావతిలో కూడా వరద పోటెత్తడంతో పార్నపల్లి వద్ద నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు గండికోట ఎగువున పెన్నాలో కలుస్తుంది.
గండికోట కు అదనంగా వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు. గండికోట దిగువున ఉన్న మైలవరం ప్రాజెక్ట్ గేట్లు గత సాయంత్రం నుంచి తెరిచి నీటిని పెన్నాలోకి వదులుతున్నారు.
కడప టౌన్ కు సమీపంలోని బుగ్గవంక డ్యామ్ గేట్లు కూడా ఎత్తి నీటిని వదులుతున్నారు. కడప సమీపంలోని పాలగిరి కొండల నుంచి కూడా భారీ వరద వస్తుంది,ఈ వరద నీరంతా పెన్నాలోకి చేరుతుంది.
ఆ విధంగా అన్ని ఉపనదుల నుంచి వస్తున్న వరద వల్ల మరియు ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడితో పెన్నా నది పోటెత్తుతోంది. భారీగా వరద ప్రవాహం కనిపిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగటంతో సోమశిల ప్రాజెక్ట్ మీద వరద వత్తిడి ఎక్కువగా ఉన్నది. అధికారులు ముందుగానే చర్యలు తీసుకొని సోమశిల నుంచి నీటిని వదలటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ వర్షం మళ్ళీ మొదలయితే భారీ నష్టం తప్పదు.సోమశిల 6.3 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేయగలదు . ప్రస్తుతం దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరద సోమశిలను చేరుతుంది.. సోమశిల కట్ట మీద నీరు పొంగిపొర్లినా దాదాపు 7.9 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ అవుతుంది,కాబట్టి సోమశిల డ్యామ్ తెగుతుందన్న భయం లేదు.
సోమశిల దిగువున అనంతసాగరం వద్ద బీరాపేరు,బొగ్గేరుల నుంచి భారీగా వరద పెన్నాలో చేరుతుంది. ఈ మొత్తం వరద నెల్లూరు ను ముంచెత్తుతుంది .
పెన్నా పరిసరాల్లో వరద తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల పరిధిలో అప్రమత్తమయ్యింది. అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అవసరమైన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దింపింది.