ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మంగళవారం హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు..
కాగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం తదితర సంఘటనల కారణంగా మతం రంగు పులుముకున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయాలపై దాడులు జరగడం వెనుక కుట్ర కోణం ఉందని అమిత్ షాకు వివరించనున్నట్లు సమాచారం. ఆలయాలపై దాడుల వెనుక కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.అంతేకాకుండా అంతర్వేది రథం దగ్ధం అంశంపై సీబీఐ విచారణను వెంటనే ప్రారంభించాలని సీఎం జగన్ కోరనున్నారు.
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1 న పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటుగా ప్రాజెక్టులకు నూతన నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆలయాలపై దాడులు,విగ్రహాల ధ్వంసం సంఘటనలతో మతం రంగు పులుముకున్న నేపథ్యంలో సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.