1980లో పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్ అయినా అనంతపురం చిన్న టౌన్ మాత్రమే. బ్రిడ్జి దిగితే థర్డ్ రోడ్డు ఆఖరు. సాయినగర్ తర్వాత జీసస్ నగర్. విద్యుత్ కాలనీ ఇంకా ఏర్పడలేదు. Old Townలో సంగమేష్ లాస్ట్. ఇటు తాడిపత్రి బస్టాండ్ దాటితే బుక్కరాయసముద్రమే.
ఊళ్లో కాంగ్రెస్ రాజకీయాలే నడిచేవి. జనతాకి బలం లేదని తేలిపోయింది. సీపీఐ బలంగా ఉండేది. ప్రైవేట్ స్కూళ్లు మెల్లగా ఎదుగుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీలో సీట్లు దొరకనంత కిటకిట. యువకులంతా సాయంత్రం ఆరాం హోటల్ ఏరియాలో గుంపులుగుంపులుగా కబుర్లు చెప్పుకునే కాలం. స్నేహితులు కలుసుకోవాలంటే హోటళ్లు తప్ప వేరే దారిలేదు.
సాయంత్రం పూట స్ట్రీట్ ఫుడ్ కూడా పెద్దగా ఉండేది కాదు. వడలు, బజ్జీలు కొన్ని సెంటర్లలో నడిచేవి. ఊరంతా మిక్సర్ బళ్లు ఉండేవి. ఉదయం పూట లలిత కళాపరిషత్ దగ్గర ఒకటో రెండో ఇడ్లీ బళ్లుండేవి. పాతకాలం గుండ్రటి ఇడ్లీ పాత్రలు కిరోసిన్ స్టౌ మీద ఉతికేవి.
ఆనంద్ అనే కుర్రాడు హఠాత్తుగా Talk Of The Town అయ్యాడు. అతను సప్తగిరి హోటల్లో లాడ్జి బాయ్‌గా పనిచేసేవాడు. ఆ పని మానేసి LIC ఆఫీస్ దగ్గర అక్కచెల్లెళ్లతో కలిసి ఇడ్లీ బండి పెట్టాడు. పెట్టెలా ఎత్తుగా ఉన్న ఇడ్లీ పాత్ర అప్పటికీ లేటెస్ట్. బెంగళూరు నుంచి తెచ్చాడు. 3 రోజుల్లో అందరికీ తెలిసిపోయింది. ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందని. చెట్నీ అదిరిపోయిందని. రూపాయికి 5 ఇడ్లీలు. జనం క్యూ కట్టారు. ఎప్పుడు పోయినా 15 నిమిషాలు మినిమం Waiting. నెలరోజులు బిజినెస్ నడిచింది. పోటీగా సుభాష్‌రోడ్డు మొత్తం అదే మాదిరి ఇడ్లీ బళ్లు వచ్చేశాయి. 3 నెలల తర్వాత ఆనంద్ బండి కనపడలేదు. తర్వాత అతని గురించి నాకు తెలియదు.
అదే సమయంలో క్లబ్ ఎదురుగా ఒక పానీపూరీ బండి వచ్చింది. అప్పటికీ దాని గురించి ఊళ్లో ఎవరికీ తెలియదు. మెల్లగా రుచి మరిగారు. ఏడాది తర్వాత వాటి సంఖ్య పెరిగింది. ఇపుడైతే లెక్క పెట్టలేం.
ఐస్‌క్రీమ్ , చాట్‌లని స్టైల్‌గా టేబుళ్లపై అందించడం Joy Worldతో మొదలైంది. గుల్జార్‌పేటలో కొంత కాలం ఉండింది. ఇది మొదటి ఐస్‌క్రీం పార్లర్. తర్వాత వచ్చిన సుఖ్‌సాగర్, ఎమరాల్డ్ ఇంకా కొనసాగుతున్నాయి.
80 ప్రాంతంలో వచ్చిన హర్యానా జిలేబి ఇప్పటికీ సిటీలో నెంబర్ 1. అప్పటి వరకు జిలేబిని షాప్స్‌లో బళ్లలో అమ్మేవాళ్లు. అదెప్పుడూ ప్రెష్‌గా ఉండేది కాదు. వేడిగా జిలేబి తినడం అనంతపురానికి నేర్పింది హర్యానా జిలేబి. అరగంట ఎదురు చూసినా దొరికేది కాదు, అంత డిమాండ్.
కమలానగర్లో ఒక సేట్ ఉండేవాడు. ఇంటి ముందరే స్వీట్స్ బండి పెట్టేవాడు. ఆ మారుమూల సందులో జనం వెతుక్కుంటూ వెళ్లి స్వీట్స్ తెచ్చుకునేవాళ్లు. కాలేజీ ఫంక్షన్లకు ఆయన స్వీట్లే , ఆఫీస్ ఫంక్షన్లకీ ఆయనకే ఆర్డర్. అనపగింజల మిక్చర్ అద్భుతమైన రుచితో దొరికేది. ఆయన చనిపోయాడు. అదే ప్లేస్‌లో పిల్లలు షాప్ Open చేశారు. ఈ మధ్య వెళ్లి అనప మిక్చర్ అడిగితే అంటే ఏంటి అంకుల్ అని కౌంటర్లో ఉన్న అమ్మాయి అడిగింది. ముసలాయన పేరు పోగొట్టడానికి పిల్లలు ఆ షాప్ పెట్టారు.
తండ్రి పేరు చెడగొట్టని పిల్లలు కూడా ఉన్నారు. రఘువీరా టాకీస్ కాంపౌండ్‌లో హైదరాబాద్ పాన్ సెంటర్ ఉండేది. ఇద్దరు అన్నదమ్ములు నడిపేవాళ్లు. థియేటర్ పోయిన తర్వాత షాప్ Place మారింది. ఇపుడు సుభాష్ రోడ్డులో ఉంది. అదే రుచి హైదరాబాద్‌లో కూడా అతి తక్కువ చోట్ల మాత్రమే ఇంత మంచి పాన్ దొరుకుతుంది.
అప్పటికే Non Veg హోటల్స్ చాలా ఉండేవి కానీ, మోటుగా ఉండేవి. మంచి ఫర్నిచర్ , ఆంబియన్స్ ఉండేది కాదు. ద్వారకా, అయోధ్యలో బిర్యానీ ఫేమస్. శ్రీకంఠం దగ్గర గీతా లంచ్ హోమ్‌లో కూడా బిర్యానీ రుచిగా ఉండేది.
1985లో బెంగళూరు R.R హోటల్స్ స్టైల్లో మిత్రులు మేఘనాథ్, మేఘరాజ్ , హర్ష ఇంకొందరు కలిసి కోకిల హోటల్ పెట్టారు (ఇప్పుడు రుచి హోటల్ Place). బ్రహ్మాండమైన ఫర్నిచర్, రుచిగా ఉండే బిర్యానీ Posh Look. జనం కిటకిటలాడిపోయారు. పార్టనర్స్ ఎక్కువ కావడం, ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్లకి ఉండడంతో ఏడాది గడవకుండా నిలిచిపోయింది.
లైబ్రరీ పక్కన చిన్నకొట్టంలో గౌసియా హోటల్ ఉండేది. పరోటా, Egg Curry కి ఫేమస్. లలిత కళాపరిషత్ పక్కన ఉన్న వెరైటీ స్వీట్ హౌస్‌లో చపాతి ఆల్ టైమ్ హిట్. ఆ పక్క సందులో బండి మీద బాషా ఆమ్లేట్లు వేసేవాళ్లు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకూ అతని చెయ్యి కదులుతూనే ఉండేది.
మనుషులంతా మాయమైపోతారు. పాతకి బదులు కొత్తవి వస్తాయి. ఊరు కూడా మారిపోతుంది. జ్ఞాపకాలు మారవు.
జ్ఞాపకం , దేవుడిచ్చిన వరం.
ఒక వయసు దాటాక, జ్ఞాపకమే ప్రాణదాత …విధాత.