గత కొన్ని నెలలుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు భూమా అఖిలప్రియ చుట్టూ తిరుగుతున్నాయి. హఫీజ్ పేట భూముల వ్యవహారంలో బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం, తర్వాత అఖిలప్రియ అరెస్టు కావడం, కొన్ని రోజులు చంచల్‌గూడ జైలులో ఉండటం.. బెయిల్‌పై రిలీజ్ కావడం తెలిసిందే. కరోనా కారణంగా తాము విచారణకు హాజరుకాలేమని చెబుతూ నకిలీ కరోనా సర్టిఫికెట్‌ను భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్ ఇవ్వడం వివాదం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపైనా కేసు నమోదైంది. ఇదిలా ఉండగానే మాజీ మంత్రి అఖిలప్రియకు ప్రధాన అనుచరుడైన రవిచంద్రారెడ్డిని చంపేందుకు రెక్కీ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పోలీసుల ఛేజింగ్.. తప్పించుకున్న దుండగులు
ఆళ్లగడ్డలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో పట్టపగలే రెక్కీ నిర్వహించడం తీవ్ర కలకలం రేపుతోంది. అఖిలప్రియకు అనుచరుడిగా పేరున్న రౌడీ షీటర్ రవిచంద్రారెడ్డి ఇంటి ముందు రెండు రోజుల కిందట స్కార్పియో వాహనాన్ని ఆపారు. అయితే కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో గమనించిన రవిచంద్రారెడ్డి భార్య పోలీసులకు సమాచారమిచ్చారు. గోవిందపల్లెకు చేరుకున్న పోలీసులు స్కార్పియోను వెంబడించారు. దీంతో దుండగులు కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వేగంగా వెళ్తూ మెట్టపల్లి దగ్గర ఓ మహిళను కూడా ఢీకొట్టారు. పోలీసులతోపాటు గోవిందపల్లె వాసులు కూడా వెంబడించడంతో దుండగులు దారిలోనే కారును వదిలేసి ఉడాయించారు. వాళ్లు నల్లమల అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఎంతమంది వచ్చారనేది తెలియలేదు.
హైదరాబాద్‌కు చెందిన బైక్ నెంబరు ప్లేట్‌తో..
దుండగులు గోవిందపల్లెలో కారులో తిరగడం, రవిచంద్రారెడ్డి ఇంటి ముందే కారు ఆపడం, పోలీసులు రాగానే పరారవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. రవి చంద్రారెడ్డిని చంపేందుకే వాళ్లు వచ్చారని, అందుకే పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తప్పుడు నంబర్ ప్లేటుతో వచ్చారని అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన బైక్ నంబరు ప్లేట్‌తో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కారుపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని రాసి ఉందని, అయితే కారు ఎవరిదనేది తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
పాత కక్షల నేపథ్యంలోనేనా..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందుకు ఎన్నో జీవితాలు బలయ్యాయి. కత్తితో తిరిగిన వాళ్లు చివరికి అవే కత్తులకు బలయ్యారు. తాజాగా గోవిందపల్లెలో రెక్కీ వ్యవహారం కూడా పాత కక్షలో నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. రవిచంద్రారెడ్డిపై రౌడీ షీట్ ఉంది. 2017లో గోవిందపల్లెలో జరిగిన రెండు హత్య కేసుల్లో, 2018లో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట గ్రామంలో మద్దుల రమణారెడ్డి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు.
2020 మార్చిలో ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు రూ.40 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో కడప జిల్లా చిన్నచౌక్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పథకం ప్రకారం హత్య చేసేందుకు లేదా ముందుగా కదలికలను పసిగట్టేందుకు దుండగులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆళ్లగడ్డ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.