దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ సరళిని బట్టి ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగి తేలుతున్నారు. తమ అనుచరులకు ఫోన్లు చేస్తూ వాకబు చేస్తున్నారు. ఎక్కడెక్కడ గట్టి పోటీ ఇచ్చాము..? ఎక్కడెక్కడ ఆధిక్యత వచ్చే అవకాశాలు ఉన్నాయి..? ఎక్కడ వైఫల్యం చెందామంటూ గెలుపోటములు బేరీజు వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కీలకఘట్టమైన పోలింగ్ మంగళవారం ముగియడంతో ఈ నెల 10న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈసారి దుబ్బాకలో పాగా వేసేది తామే అని బీజేపీ ఢంకా భజాయిస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.
ఎన్నికల క్రమాన్ని ఓ సారి అవగతం చేసుకుంటే…
ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 56 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సెప్టెంబర్ 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆ 56లో దుబ్బాక కూడా ఉంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 16. 17న నామినేషన్లను పరిశీలించారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 3న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు.
టీఆర్ఎస్ వర్గాలు ఎలా అంచనా వేస్తున్నాయంటే..
ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా ఓటు వేశాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టీఆర్ఎస్ విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వచ్చింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2014 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్ఎస్ శిబిరం అంచనా వేస్తోంది.
బీజేపీ ధీమా వెనుక కారణాలేంటి..?
గతంలో రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన రఘునందన్… ఈసారి ఓటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. దశాబ్డన్నర కాలంగా నియోజకవర్గ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న ఆయన ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగారు. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ… ప్రచారపర్వంలో బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బీజేపీ… మంగళవారం జరిగిన పోలింగ్ సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది.
మెరుగైన ఫలితం సాధిస్తామంటున్న కాంగ్రెస్
దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టీఆర్ఎస్కు ఉండే అనుకూలత, బీజేపీ దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బీజేపీ మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. మొత్తం మ్మీద మూడు పార్టీలూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల విజయ రహస్యం బయటపడాలంటే బయటపడాలంటే ఈ నెల 10 వరకు ఆగాల్సిందే.