ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కీలక అంశాలపై ఆయన కేంద్రం పెద్దలతో చర్చించబోతున్నారు. వాస్తవానికి గతవారమే దాదాపుగా పర్యటన ఖరారయినప్పటికీ అమిత్ షాకి ఆఖరినిమిషంలో అత్యవసర పని ఏర్పడడంతో అప్పట్లో వాయిదా పడింది. దానిని కూడా రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించిన మీడియాలోని ఓ సెక్షన్, ప్రదాన ప్రతిపక్ష నేతలకు తాజా పర్యటన మింగుడుపడడం లేదు. అమిత్ షా రమ్మని, మళ్లీ ఆయనే వద్దన్నారంటూ వార్తలు రాసుకుని మురిసిపోయే లోగా వెంటనే పర్యటన ఖరారు కావడం వారికి రుచించడం లేదు. అయినప్పటికీ వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరుతున్న తరుణంలో వ్యవహారం ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కీలక సమస్యలను జగన్ ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం కొర్రీలు వేస్తోంది. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదాలకు ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడింది. కుడి, ఎడుమ కాలువల బిల్లులను ఇప్పటికే తిప్పి పంపిన ఉదంతం ప్రాజెక్టు పరిస్థితిని గందరగోళంలోకి నెడుతోంది. దాంతో జగన్ దానిని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెంటబెట్టుకుని అమిత్ షా తో పాటుగా ఇరిగేషన్ మంత్రి గజేంద్ర షెకావత్ ని కూడా కలవబోతున్నారు. పోలవరం అంశాన్ని ప్రధానంగా ప్రస్తవించబోతున్నారు.
Also Read:యనమల చెబుతున్నారు.. నమ్మండి.. 17 లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయంట..!!
దాంతో పాటుగా ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి పలు విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందనను ఆశిస్తున్నారు. అదే సమయంలో సీఎస్ పదవీకాలం పొడిగింపు అంశం కూడా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ చేసిన సూచనలు ఇటీవల ప్రధాని కూడా అంగీకరించారు. దాంతో కొంత స్పష్టత వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే కేటాయింపుల విషయంలో జగన్ కేంద్రానికి విన్నవించే అవకాశం ఉంది. జీఎస్టీ బకాయిల విడుదల వంటి అంశాలు కూడా ప్రస్తావించవచ్చని భావిస్తున్నారు.
దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ స్థాయిలో జగన్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఏపీలో తిరుగులేని స్థితిలో ఉన్న వైఎస్సార్సీపీ బలం కేంద్రంలో కీలకమయ్యే స్థితి త్వరలోనే రావచ్చని అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ విషయంలో కేంద్రం పెద్దలు స్నేహపూరిత వాతావరణం కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నారు. ముఖ్యంగా యూపీ ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో మలుపులుంటాయనే చర్చ సాగుతున్న దశలో ఇది ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వ డిమాండ్ల పట్ల ఆశావాహకంగా స్పందించడానికి ముందుకొస్తుందని భావిస్తున్నారు.
Also Read:మరోసారి తెర మీదికి సోమశిల – సిద్దేశ్వరం బ్రిడ్జి
ఈ నేపథ్యంలో జగన్ కి వ్యతిరేకంగా చంద్రబాబు నడుపుతున్న కుట్ర రాజకీయాలు చెల్లుబాటు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల రఘురామరాజు ద్వారా సీఎంలకు, ఇతరులకు లేఖలు రాయిస్తూ నడుపుతున్న ప్రహసనం ఎందుకూ కొరగాని స్థితి వస్తుందని ఢిల్లీ వర్గాల అంచనా. అదే సమయంలో జగన్ కూడా ఈసారి ఊహించని ఎత్తులతో ఈ వ్యవహారానికి చెక్ పెట్టే దిశలో సాగుతున్నట్టు ఓ ప్రచారం ఉంది. అదే నిజమయితే బాబు అండ్ కో గొంతులో పచ్చి వెలక్కాయపడేట్టుగా పరిణామాలు మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.