లాక్ డౌన్ వల్ల వారు వీరు అని కాదు థియేటర్లలో రావాల్సిన అందరి సినిమాలూ ఆగిపోయాయి. ఫస్ట్ కాపీలు చేతిలో ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం పరిస్థితులను అంచనా వేయలేక సైలెంట్ అయ్యారు. ఓటిటి రిలీజుల హడావిడి ఇతర బాషలలో భారీగా ఉన్నా తెలుగులో మాత్రం అంత చప్పుడు లేదు. ముఖ్యంగా కాస్తో కూస్తో క్రేజ్ ఉన్నవాటితో మొదలుకుని భారీ బడ్జెట్లతో తీసిన స్టార్ సినిమాల దాకా అందరిదీ ఒకే సిచువేషన్. ఆగస్ట్ చివరి వారంలో హాళ్లు తెరవొచ్చని చెబుతున్నారు కానీ ధైర్యంగా ముందుకువచ్చి ఎవరు రిలీజ్ చేస్తారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా ఉంచితే అక్కినేని బ్రదర్స్ కి కు రాబోయే సీజన్ మంచి అడ్వాంటేజ్ గా మారబోతోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లవ్ స్టోరీని వాస్తవానికి ఈవేసవి లోనే ప్లాన్ చేశారు. కానీ ఇంకొంచెం బాలన్స్ ఉండగానే అంతా బంద్ అయిపోయింది. ఒకవేళ షూటింగ్ మొదలుపెట్టినా ఈ ఏడాది కాకుండా సంక్రాంతి 2021కి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉందట. ఎందుకంటే ఆర్ఆర్ఆర్, ఆచార్య, నారప్ప, వకీల్ సాబ్ ఇవేవి ఆ టైంలో వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా ఇంచుమిందు ఇదే కండిషన్ లో ఉంది. దీన్ని కూడా వచ్చే సంవత్సరమే టార్గెట్ చేస్తున్నారట. ఒకవేళ పండక్కి లవ్ స్టోరీతో పాటు పెద్ద పోటీ లేకపోతే ఓ మూడు రోజుల గ్యాప్ తో ఈ సినిమాను దింపితే మంచి ఫలితాలు వసూళ్లు దక్కుతాయి.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. దీని మీద అక్కినేని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ వారంలో ఏదో స్పెషల్ పోస్టర్ తో ప్రమోషన్ ని తిరిగి మొదలుపెట్టబోతున్నారు. ఒకవేళ కేసులు తగ్గినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ని అంతవేగంగా పూర్తిచేయలేరు. ఎందుకంటే పూజా హెగ్డే డేట్స్ సులభంగా సర్దుబాటు కావు. రాధే శ్యామ్ తో పాటు ఇతర కమిట్ మెంట్స్ ని కూడా తాను బాలన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములు జనవరినే లక్ష్యంగా పెట్టుకున్నా నష్టం లేదు. రెండూ ఆడేందుకు అవకాశం ఉంటుంది. పోటీ అనుకోవడానికి లేదు. పైగా చాలా గ్యాప్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న సందడి ఉంటుంది కాబట్టి మంచి వసూళ్లు ఆశించవచ్చు. సో అక్కినేని బ్రదర్స్ కనక అన్ని అనుకున్నట్టు సవ్యంగా జరిగితే జనవరిలోనే అభిమానులను పలకరిస్తారు