అమరావతి భూ కుంభకోణం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.ఆ ఫైళ్లు తీస్తున్నకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో అక్కడ భూములు కొన్నట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. అంటే పలువురు పెద్దలకు, వారి కుటుంబాలకు చంద్రబాబు ఇలా నైవేద్యం సమర్పించి తమ అక్రమాలకు రాచమార్గం వేసుకుంటూ తన తప్పుల్లో వాళ్ళనూ భాగస్వాములను చేసినట్లు అర్థం అవుతోంది.
మాజీ అడ్వొకేట్ జనరల్ దొమ్మలాపాటి శ్రీనివాస్ మాత్రమే కాకుండా సుప్రీం కోర్ట్ సీనియర్ జడ్జ్ ఎన్ వీ రమణ ఇద్దరు కుమార్తెలు నూతలపాటి శ్రీ భువన, నూతలపాటి శ్రీ తనూజ లపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. వారిద్దరి పేరిటా అమరావతిలో భూములున్నట్లు , అది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగంగా కొనుగోలు చేసినట్లు ఎసిబి గుర్తించింది.
గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ నూతన ప్రతిపాదిత రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో చట్టవిరుద్ధమైన భూ ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారం పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత విచారణ చేపట్టింది.
Also Read:అమరావతి కుంభకోణం: మాజీ ఏజీ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు
ఒకవైపు సిట్ విచారణ జరుగుతోన్న నేపథ్యంలోనే ఎసిబి డైరెక్టర్ జనరల్ పీ ఎస్ ఆర్ ఆంజనేయులుకు, రాజధాని ప్రాంతానికి చెందిన కొమట్ల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నుండి ఫిర్యాదు వచ్చింది. అమరావతి లో రాజధాని ఏర్పాటు గురుంచి గత తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలనుంచి ప్రత్యేకంగా ముందస్తు సమాచారం ఉన్న కొంతమంది చట్టవిరుద్ధంగా లాభాలను ఆర్జించడానికి స్థలాలను కొన్నారు. ప్రభుత్వం లో ఉన్న పెద్దలు ఇలా సెలెక్టివ్ గా కొంతమందికి మాత్రమే ఈ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఇచ్చి వారికి లబ్ది చేకూర్చారు. ఇది తప్పనిసరిగా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్తూ ఇందుకోసం న్యాయ వ్యవస్థలోని అత్యున్నత పదవులలో ఉన్నవారితో పాటు అనేకమంది ఉన్నతాధికారులు తమ సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించి తమ బంధు మిత్రుల పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొన్నారన్న ఫిర్యాదును ఏసీబీ స్వీకరించింది., పిటిషనర్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నిర్వహించాలని గుంటూరు జిల్లా ఏసీబీ శాఖను ఆదేశించింది.
విచారణాధికారి ప్రాథమిక ఆధారాల మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అధికారిక పదవిని దుర్వినియోగం చేశారు. తద్వారా తన బావ కోసం కొనుగోలు చేసిన ఆస్తుల రూపంలో ధన ప్రయోజనం పొందారు. ఆయన బావమరిది మరియు అతని సహచరులు జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు మరియు తరువాత 2015 & 2016 సంవత్సరాల్లో ఈ ఆస్తులలో కొన్నింటిని కొనుగోలు చేయడం ద్వారా తనకు మరియు అతని భార్యకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read:టీడీపీ శిబిరంలో కొత్త చిచ్చు, ఏసీబీ కేసుల్లో ఎవరి కొంపకొల్లేరవుతుందో?
అలాగే సుప్రీం కోర్ట్ జడ్జ్ లాంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని ఉల్లంఘించడానికి తమ తమ రాజ్యాంగ స్థానాలు లేదా వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించడం ఆమోదయోగ్యమైనది కాదని, ఇలాంటి సంఘటనల వల్ల రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతపై అనుమానాలను, అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని ఏసీబీ పేర్కొంది. అవినీతి నిరోధక శాఖ చట్టంలోని 1988 లోని 13 (2), రెడ్ విత్ 13 (1) (డి) (ii) సెక్షన్లు కాకుండా ఎన్ వీ రమణ కుమార్తెలతో పాటు పైన పేర్కొన్న నిందితులందరిపై ఐపిసి 409, 420 మరియు 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎఫ్.ఐ.ఆర్ లో ఇంకా నన్నపనేని లక్ష్మీ నారాయణ, దమ్మాలపాటి శ్రీనివాస్(మాజీ అడ్వకేట్ జనరల్ ) ,నన్నపనేని సీతా రామరాజు,నన్నపనేని కృష్ణ మూర్తి మాదాల విష్ణువర్ధన్ రావు, ముక్కపతి పట్టాభి రామారావు, యార్లగడ్డ రితేష్, యార్లగడ్డ లక్ష్మి, నూతలపాటి శ్రీ తనూజా (సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి.రమణ కుమార్తె), నూతలపాటి శ్రీ భువన ( సుప్రీంకోర్టు జడ్జి ఎన్.వి.రమణ కుమార్తె) పేర్లు ఉన్నాయి. వీరంతా అమరావతి ప్రాంతంలో మరియు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రాంతానికి వెలుపల గ్రామాలలో మరియు ప్రక్కనే ఉన్న గ్రామాలలో ఎక్కువ భూములను కొనుగోలు చేశారు. అంతే కాకుండా అక్కడ నిర్మిస్తోన్న ప్రధాన రహదారులు మరియు కృష్ణ నదికి అడ్డంగా నిర్మించటానికి ప్రతిపాదించబడిన వంతెన లాంటి చోట ఖరీదైన ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన వివరాలను కూడా ఫిర్యాదుదారుడు అందజేసినట్లు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.
Also Read:దమ్మాలపాటికి దడ పుట్టిందా? మాజీ ఏజీలో ఎందుకీ ఆందోళన??
ఈ పరిణామాలు రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం కలిగించాయి. రాష్ట్రానికి సంబంధించి న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎన్ వీ రమణ కుమార్తెల పేర్లు కూడా ఇందులో ఉండడం తో న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక వైపు రాష్ట్రంలో ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థ కి మధ్య జరుగుతోన్న సంఘర్షణ నేపథ్యంలో ఏకంగా సుప్రీంకోర్ట్ జడ్జి పైనే ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.