రాజకీయ ప్రయోజనాల సాధనలో మీడియా పావుగా మారడంతో ప్రజల్లో పలుచన అయిపోతున్న విషయం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అందులోనూ కొన్ని మీడియా సంస్థల్లో వారి యజమానుల ఆర్థిక,సామాజిక లక్ష్యాల సాధనలో అర్థసత్యాలు దర్జాగా ప్రచారం సాగిస్తుండడంతో పత్రికాస్వేచ్ఛకి అర్థమే మారిపోయిందనే అభిప్రాయం బలపడింది. అసలు విషయాన్ని తమ ఆలోచనలకు అనుగుణంగా చిత్రీకరించే ధోరణి చివరకు మీడియపైనే జనాల విశ్వాసం కోల్పోయేందుకు దోహదం చేస్తోంది. ఇప్పటికే చాలామంది ఏ ఒక్క పత్రికనో, చానెల్ నో చూసి వార్తను నిర్ధారించుకునే పరిస్థితి లేదు.
తాజాగా విజయవాడ నగరాన్ని అనుకుని ఉన్న నిడమానూరు పాఠశాలను గ్రామ సచివాలయంగా మార్చినట్టు ఆంధ్రజ్యోతి లో వార్త వచ్చింది. కానీ వాస్తవానికి పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో తాత్కాలికంగా వేరే భవనంలో పాఠాశాల నిర్వహిస్తున్నారనే విషయం దాచిపెట్టింది. అసలు పాఠశాల భవనం శిధిలస్థితికి చేరినా ఎందుకు పట్టించుకోలేదు..గత ప్రభుత్వ కాలంలోనే కమ్యూనిటీ హాల్ ని బడిగా ఎందుకు మార్చింది.. బడి భవన నిర్మాణానికి ఎందుకు పూనుకోలేదు..ఎవరు అడ్డువచ్చారు…అనే ప్రశ్నలకు అడగ వలసిన సమయంలో అంటే చంద్రబాబు అధికారంలో ఉండగా అడగని ఆంధ్రజ్యోతి ఈ రోజు వాస్తవాలను దాచిపెట్టి కథనాలు అల్లేసింది.
ఇక ప్రస్తుతం కమ్యూనిటీ హాల్ ని సచివాలయంగా మార్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా తాత్కాలికంగా 45 మంది విద్యార్థులున్న పాఠశాలలో బోధనకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించేందుకు మండల విద్యాశాఖాధికారుల ఆదేశాలతో విద్యాకమిటీ టెంటులు కూడా ఏర్పాటు చేసింది. కానీ దానిని గ్రామంలో పెద్దలు ఏర్పాటు చేసినట్టు సదరు మీడియా చిత్రీకరించింది. పైగా ఆంధ్రజ్యోతిలో రాత్రిపూట టెంటు ఏర్పాటు చేసినట్టు ఫోటో కూడా ప్రచురించడం మరో విశేషం.
ఒకే భవనంలో గ్రామ సచివాలయం, పాఠశాల నిర్వహించేందుకు అవకాశం లేదు. దాంతో పాఠశాలకు నూతన భవనం మంజూరు చేసి భవన నిర్మాణం తక్షణం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా నిర్మాణ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అది పూర్తికాగానే పాఠశాల తమ సొంత భవనంలోకి మారుస్తామని విద్యాశాఖాధికారులు అంటున్నారు. అయితే అక్కడ పాఠశాల భవనం నిర్మాణం జరుగుతున్న విషయం, ఈలోగా రెండు రోజుల పాటు తాత్కాలికంగా పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఆటంకం ఏర్పడిన విషయం, దానికి పరిష్కారంగా కొన్ని చర్యలు తీసుకుంటున్న సంగతిని విస్మరించి వార్తలు ప్రచురించడం ఎవరి ప్రయోజనాల కోసమన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఇటీవల వరుసగా రంగుల కథలు అల్లుతూ పాఠకులను పక్కదారిపట్టించే పనిలో ఉన్న ఓ వర్గం మీడియా , ఇలాంటి స్థానికంగా చిన్న చిన్న తాత్కాలిక సమస్యలను కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేయడం విస్మయకరంగా ఉందని స్థానికులు కూడా అంటున్నారు.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో పాఠశాలకు భవనమే లేకపోవడంతో వానలో, ఎండలో పిల్లలు అనేక అవస్థలు పడుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. చివరకు తాత్కాలిక భవనం ఏర్పాటు, శాశ్వత భవన నిర్మాణం సాగుతుండగా వక్రీకరించే యత్నం చేయడం వారి నైజానికి నిదర్శనమని వారు అంటున్నారు. అదే సమయంలో స్థానికంగా సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగి ఉంటే చర్యలు తప్పవని చెబుతున్న విద్యాశాఖ అధికారులు కూడా విచారణ కు సిద్ధపడుతున్నారు. ఏమైనా ఒకనాడు మీడియాలో వార్త వస్తే కనిపించిన కదలిక ఇప్పుడు లేకపోవడానికి ఇలాంటి అర్థసత్యాల ప్రభావమే అనే అభిప్రాయం సామాన్యుల నుంచి కూడా వినిపించడం విశేషం.