వైద్యాన్ని పేద వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ రెండున్నరేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రెండున్నరేళ్ల క్రితం వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 లక్షలకు పెంచింది. దీనివల్ల రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తోంది. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్దగా లేవన్న సంగతి తెలిసీ కూడా, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించే వారు కాదు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు.
క్యాన్సర్‌కు వ్యాధి నయమయ్యే వరకు చికిత్స
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో క్యాన్సర్‌కు ఒకటి రెండు సార్లు మాత్రమే కీమోథెరపీ చేసేవారు. ఇప్పుడు రూ.2.5 లక్షలు, రూ.3 లక్షలు కాదు, ఏకంగా రూ.5 లక్షలు దాటినా వ్యాధి నయమయ్యే వరకు కీమోథెరపీ ఇచ్చి ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందిస్తున్నారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను చేయిస్తున్నారు. మూగ, చెముడు పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయిస్తున్నారు. దీనికోసం రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ.11 లక్షల వ్యయమయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. 2 మోడల్స్ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకు వచ్చారు. ఒకదానికి రూ.6.3 లక్షలు, ఇంకోదానికి రూ.9.3 లక్షల ఖర్చు అవుతుంది.
ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్లు ఖర్చు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 29 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిపడిన రూ.680 కోట్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించింది. ప్రస్తుతం 21 రోజులు దాటితే చాలు.. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అండగా ఉంటుంది. గతంలో 1,059 ప్రొసీజర్లు (వ్యాధులు) మాత్రమే ఉంటే.. ఇప్పుడు 2,446 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరింపచేశారు.
కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటు
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నారు. గిరిజనుల కోసం పాడేరులో కొత్తగా ఒక వైద్య కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. ఐటీడీఏ ప్రాంతాల్లో మరో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 1,325 పీహెచ్‌సీలు, 52 ఏరియా ఆసుపత్రులు(ఏహెచ్), 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్‌సీ) రూపు రేఖలను నాడు–నేడు ద్వారా మార్చేస్తున్నారు. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. వీటన్నింటికీ రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉన్న 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి.
పోస్టుల భర్తీ..
రెండున్నరేళ్లలో వైద్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది ఏఎన్ఎంలను నియమించారు. మరో 14,788 పోస్టులు ఫిబ్రవరిలోగా భర్తీ చేయాలని నిర్ణయించారు. మొత్తంగా ఒక్క వైద్య రంగంలోనే దాదాపు 40 వేల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నారు. హెల్త్ క్లినిక్‌లలో ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రాక్టీషనర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) ఉంటారు. ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వీళ్లందరినీ పీహెచ్సీలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టర్ పీహెచ్సీలో, మరో డాక్టర్ 104లో తనకు కేటాయించిన నాలుగు, ఐదు గ్రామాల్లో తిరుగుతారు. ఇవన్నీ 6 నెలల్లో కార్యాచరణలోకి వస్తాయి. ఇందుకోసం 104 వాహనాలను మరో 432 కొనుగోలు చేయనున్నారు.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో దన్ను..
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ విషయంలో మరో విప్లవాత్మక మార్పుగా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చారు. ఆపరేషన్ చేశాక.. ఆ పేషెంట్ ఎన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ నిర్ణయిస్తే.. అన్ని రోజులు ఆ పేషెంట్ బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో వారు ఇబ్బంది పడకుండా రోజుకు రూ.220 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. లెప్రసీతో బాధపడుతున్న వారికి రూ.3 వేలు, పెరాలసిస్ రోగులకు రూ.5 వేలు, డయాలసిస్ చేసుకుంటున్న వారికి రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నారు.
ఇప్పటికే 66 లక్షల మంది స్కూలు పిల్లలకు పూర్తిగా కంటి పరీక్షలు చేశారు. 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు ఇచ్చారు. 300 మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించారు. 14.28 లక్షల మంది అవ్వాతాతలకూ కంటి పరీక్షలు చేశారు. 7.83 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1.13 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేయించారు.
ఆస్పత్రులు నెలకోల్పేవారికి ప్రోత్సాహకాలు..
రూ.100 కోట్లు పైబడి పెట్టుబడితో ఆస్పత్రులు పెట్టే వారికి భూములు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పరిధిలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. కొన్ని నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేదల ఆరోగ్యానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
Also Read : Nadendla Manohar, One Time Settlement – వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్..?