మ్యాట్రిమోనీ సైట్ లో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యకి అంతకుముందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి షాకయ్యాడు భర్త. తాను తొమ్మిదో వాడని తెలిసి లబోదిబోమన్నాడు. కృష్ణా జిల్లా గుంపలగూడెంకు చెందిన వెంకటేష్ పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు నమోదు చేసుకోగా అదే సైట్ లో మహబూబాబాద్ కు చెందిన స్వప్న ప్రొఫైల్ అతడికి నచ్చి ఇద్దరూ కలిశారు. స్వయంగా స్వప్న తన కుటుంబ సభ్యులతో గుంపలగూడెం వచ్చి పెళ్లి సెట్ చేసుకొని, పెళ్లయ్యాక ఉద్యోగం నిమిత్తం బెంగళూరులో కాపురం పెట్టారు.
అయితే భార్య ఎప్పుడూ ఫోన్ లో కోర్టు కేసులు, లాయర్ అంటూ మాట్లాడటం గమనించిన వెంకటేష్ అడిగితే విసుక్కునేది. ఓ రోజు పని ఉంది హైదరాబాద్ వెళ్లాలని చెప్పి కారణం చెప్పకుండానే వెళ్లి 2 రోజుల తర్వాత వచ్చింది. మళ్ళీ వెళ్ళాలి అని చెప్పడంతో వెంకటేష్ నిలదీస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో అతనికి అనుమానం వచ్చి ఆమె వెనకాలే బయలుదేరాడు.
ఆమెకు తెలియకుండా స్వప్న వెనకాలే వెళ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ స్వప్న నేరుగా కోర్టుకు వెళ్ళింది. దీంతో అక్కడ ఆరా తీసి, ఆమె గురించి ఎంక్వైరీ చేయగా భర్తకు అసలు విషయం తెలిసింది. స్వప్నకు అప్పటికే 8 పెళ్లిళ్లు అయ్యాయని, వాటికి సంబంధించిన విడాకుల కేసుల విచారణ కోసం ఆమె కోర్టుకు హాజరవుతుందని తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త షాక్ అయ్యి స్వప్నను నిలదీయడంతో ఆమె రివర్స్ లో భర్తపైనే టార్చర్ చేస్తున్నాడంటూ కేసు పెట్టింది. మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం చేయాలని కూర్చుంది. దీంతో పోలీసులు నిజం అనుకోని భర్తని విచారణకి పిలవగా వెంకటేష్ జరిగిందంతా చెప్పి సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించాడు. దీంతో అవాక్కయిన పోలీసులు స్వప్నను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
79020