సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా మన కథలన్నీ హీరో డామినేషన్ తో సాగేవవే. ఏదో ఒక ఐదారు శాతం దీనికి భిన్నంగా వెళ్ళాయి కాని కమర్షియల్ గా స్టామినా చాటిన వాటిలో స్టార్లే కనిపిస్తారు. లవకుశ, అడవిరాముడు, ప్రేమభిషేకం, మగధీర లాంటివి చూసుకుంటే ఎంత దర్శకుల ప్రతిభ ఉన్నప్పటికీ అందులో ఉన్న కథానాయకుల బలం వాటిని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. శంకరాభరణం, ప్రతిఘటన, అమ్మోరు లాంటివి మాత్రమే ఈ ట్రెండ్ కి భిన్నంగా నిలిచి సవాళ్ళకు ఎదురు నిలిచాయి. అయినప్పటికీ వీటిలోనూ చాలా శక్తివంతమైన పాత్రలు ఉంటాయి. అలా కాకుండా మాటలు రాని ఒక బుల్లి ఈగను టైటిల్ రోల్ లో పెట్టి కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడాన్ని సాహసం కాక ఇంకేదైనా పెద్ద పదం ఉంటె వాడాలి .
2012లో విడుదలైన రాజమౌళి ఈగ ఇప్పటికీ ఎందరో మేకర్స్ కి ఒక స్ఫూర్తిగా నిలుస్తోందంటే దానికి కారణం అందులో గ్రాఫిక్స్ కాదు. కథలో ఉన్న గొప్ప అంతరాత్మ. అందుకే ఇన్నేళ్ళు అవుతున్నా దాని తాలుకు ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉంది. టీవీలో వచ్చిన ప్రతిసారి మెస్మరైజ్ చేస్తూనే ఉంది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్, మర్యాద రామన్న లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి వెనుక బ్లాంక్ చెక్కులు పట్టుకుని తిరిగిన నిర్మాతలు ఎందరో . తమను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూడని హీరో లేరు. కొందరు మెట్టు దిగి తామే కబురు కూడా చేశారు. కాని రాజమౌళి మనసులో వేరే సంకల్పం ఉంది.
ఒక దర్శకుడు తన ప్రతిభనంతా ఉపయోగించి ఎలాంటి కమర్షియల్ సూత్రాలకు కట్టుబడకుండ కేవలం సాంకేతికతతో అద్భుతాలు ఆవిష్కరిస్తాడని ఋజువు చేయాలి. ఎస్ దాని కోసం తనకు కావాల్సింది స్టార్లు కాదు. స్టార్ లాంటి స్టొరీ మెటీరియల్. ఎప్పుడో ఏళ్ళ క్రితం నాన్న విజయేంద్ర ప్రసాద్ సరదాగా అన్న ఒక పాయింట్ ని సీరియస్ గా తీసుకుని ఈగను రాయించారు రాజమౌళి. తన బిడ్డలో ఎంత ప్యాషనేట్ ఫిలిం మేకర్ ఉన్నాడో ప్రసాద్ గారికి మరోసారి అర్థమయ్యింది. ఆలస్యం చేయకుండా ఈగను సరికొత్త పంధాలో ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని విధంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యారు. దాని ఫలితమే ఈగ లాంటి నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ అగైన్ స్క్రిప్ట్
కంటి నుంచి అతి దగ్గరగా చూస్తేనే కనిపించని ఒక చిన్న ఈగ ఆరడుగుల ఆజానుబాహుడైన మనిషి మీద ప్రతీకారం తీర్చుకోవడం అనే లైన్ నిజానికి చదవడానికే నమ్మశక్యంగా ఉండదు. అలాంటిది తెరమీద చూపించాలంటే అది కత్తి మీద సామే. అందులోనూ కేవలం గ్రాఫిక్స్ ఘనంగా ఉన్నంత మాత్రాన జనం గుడ్డిగా ఎగబడి చూసే రోజులు కావివి. ఇంటర్ నెట్ విప్లవం వచ్చాక ఇప్పట్లో మనం అందుకోలేనంత టెక్నాలజీతో రూపొందిన ఇంగ్లీష్ సినిమాలు ఆన్ లైన్ లో ఫ్రీగా దొరుకుతున్న కాలమిది. ఇది తెలిసే రాజమౌళి సిల్లీ పాయింట్ మీద ఎమోషన్ అనే బలమైన థ్రెడ్ ని ఎలా వాడాలో తన తెలివినంతా ఉపయోగించి చేశాడు. ఎక్కడ ఏ చిన్న సీన్ నమ్మశక్యంగా లేకపోయినా నవ్వులపాలు కావడం ఖాయం.
అందుకే శిల్పాన్ని చెక్కిన తరహాలో ఈగలోని ప్రతి ఫ్రేమ్ బెస్ట్ రావడం కోసం అత్యున్నత టీంని దీని కోసం సెట్ చేసుకున్నాడు. రాజీ పడే తత్వం ఎప్పుడూ లేదు కాబట్టి దానికి తగ్గట్టే పనులు ఒక్కొక్కటి ఈగ వేగంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. ఫస్ట్ హాఫ్ లో మాత్రమే కనిపించి చనిపోయే పాత్ర ఒప్పుకున్న నాని గట్స్ కి అందరూ ఆశ్చర్యపోయారు. సమంతా కన్నా అందమైన ఆప్షన్ జక్కన్నకు తట్టలేదు. కన్నడలో మంచి స్టార్ డం ఉన్న కిచ్చ సుదీప్ విలన్ పాత్ర్ చేసేందుకు సంశయించలేదు. రాజమౌళిని నమ్మాడు అంతే. ట్యూన్స్ తో కీరవాణి రెడీ. ఇలా ఒక్కో పోగుతో పట్టు వస్త్రాన్ని నేసినట్టు అందరిని జాగ్రత్తగా కూర్చుకున్నాడు జక్కన్న.
రిలీజయ్యాక మొదటి రెండు మూడు రోజులు కేవలం దర్శకుడి పేరు మీదే ఓపెనింగ్స్ వచ్చాయి. నాని, సమంతాలకు అభిమానులు ఉన్నప్పటికీ అన్నేసి హాల్స్ ఫుల్స్ చేయించే రేంజ్ కాదు. టాక్ పబ్లిక్ లోకి వెళ్లిపోయింది, నాని పాత్ర తాలుకు బాధని పగను ప్రేక్షకులు తమదిగా భావించారు. నమ్మశక్యం కాని సన్నివేశాలు తెరమీద జరుగుతున్నా అందులో మిస్ అవుతున్న లాజిక్ వాళ్ళ బుర్రలకు తట్టడం లేదు. అంతలా మాయ చేశారు రాజమౌళి. విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో కీలక పాత్ర పోషించగా ముందు చెప్పుకున్నట్టు ఎక్కడా ఎమోషన్ తగ్గకుండా ఈగ అంతర్మధనాన్ని చూస్తున్నవాళ్ళ మనసులో రిజిస్టర్ చేయడం కోసం రాజమౌళి చేసిన స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది.
ఫలితంగా అబ్బురపరిచే వసూళ్లు. మతిపోయే కలెక్షన్లు, షేర్లు. అసలు హీరోనే లేకుండా ఒక కీటకంతో ఇంత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టొచ్చా అని అందరూ నోరెళ్ళ బెట్టుకుని చూశారు. కాని అక్కడ ఉన్నది రాజమౌళి. కోట్లమంది అభిమానించే హీరో అయినా ఈసడించుకునే ఈగైనా తన గురి ఎప్పుడు తప్పదని మరోసారి నిరూపించుకున్నారు. బుల్లితెరపై వచ్చిన ప్రతిసారి ఇందులో మేజిక్ ని ప్రేక్షకులు పదే పదే ఆస్వాదిస్తూనే ఉన్నారు. దీన్ని తలదన్నే స్థాయిలో ఇంకెవరు మరో సినిమా తీయలేకపోయారు. అందుకే ఈగ ఇవాళ్టితో 8 ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఇంకా దాని తాలుకు వైబ్రేషన్స్ వెంటాడుతూనే ఉన్నాయి.