జనం సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి నాటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయి ఆదివారం నాటికి మూడేళ్లు అయింది. తెలుగుదేశం పార్టీ
దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో 2017 నవంబర్ 6న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి తొలి అడుగు వేశారు. ప్రజల సమస్యలు వింటూ.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ.. జనం మధ్య పాదయాత్ర సాగింది. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు యాత్ర సాగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ముగిసింది.
తిరుగులేని విజయం అందించిన జనం..
పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల్లో, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. సంక్షేమ రాజ్యానికి అదే రోజే పునాది వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి ఏడాదే 95 శాతం అమలు చేశారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల ద్వారా 1.21 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశారు. పలు ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 50 శాతానికిపైగా కేటాయించి.. సామాజిక న్యాయానికి అసలు సిసలు నిర్వచనం చెప్పారు. అందులో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చి వేసింది. రికార్డు స్థాయిలో వేల కిలోమీటర్లు నడిచి, జనం కడగండ్లను ఓపికగా విని, అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో వాటిని పరిష్కరిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డిని జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపిస్తున్నారు.