సాధారణంగా ఏ హీరో అయినా రేంజ్ పెరగాలన్నా, స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలన్న మాస్ ప్రేక్షకుల అండ తప్పనిసరి. అందులోనూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళకు ఇది చాలా అవసరం. 1989లో శివ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నాగార్జున ఎంచుకున్న ప్రయోగాత్మక దారి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. వరస పరాజయాలు తప్పలేదు. కేవలం ఒక వర్గాన్ని మాత్రమే మెప్పించేలా అవి రూపొందటంతో అభిమానులను ఒకరకమైన అసంతృప్తి వెంటాడుతూ ఉండేది. నిర్ణయంతో మొదలుపెట్టి అంతం దాకా ఇదే ధోరణి కొనసాగింది. అందుకే ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నుంచి తన రూట్ మార్చుకున్నాడు నాగ్. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మంచి డ్రామాతో రూపొందిన ఆ చిత్రం సూపర్ హిట్ కావడం ఆ వెంటనే వారసుడు కూడా అదే ఫలితాన్ని అందుకోవడం మంచి కిక్ ఇచ్చింది. ఆ ఊపును అలాగే కొనసాగిస్తూ నాగార్జున చేసిన మరో మాస్ ఎంటర్ టైనర్ 1993లో విడుదలైన అల్లరి అల్లుడు.
తన హోమ్ బ్యానర్ గా భావించే కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సుమన్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో అత్తగా, వదినగా, అమ్మగా గొప్ప పాత్రలు పోషించిన వాణిశ్రీని ఇందులో చాముండేశ్వరి పాత్రకు తీసుకోవడం చాలా ప్లస్ అయ్యింది. నాగ్-వాణిశ్రీ కాంబోలో గతంలో అగ్ని వచ్చింది కానీ చేదు ఫలితం అందుకుంది. హీరోయిన్లుగా మీనా, నగ్మా లను తీసుకోవడం గ్లామర్ పరంగా హైప్ తీసుకొచ్చింది. విడుదలకు ముందే కీరవాణి పాటలు ఆడియో సేల్స్ ని అదరహో అనిపించాయి. రమ్యకృష్ణ తళుక్కున మెరిసిన నిన్ను రోడ్డు మీద చూసినది లాగయిత్తు సాంగ్ ఓ రేంజ్ లో మారుమ్రోగింది. డబ్బు మదంతో అబద్దాల పొరలు కప్పుకున్న తన అత్తయ్య కళ్ళను తెరిపించేందుకు ఓ కుర్రాడు ఆడిన డ్రామానే అల్లరి అల్లుడు.
తగిన పాళ్ళలో వినోదం, అలరించే పాటలు. మంచి తారాగణం ఇలా అన్ని పక్కాగా సమకూరడంతో అల్లరి అల్లుడు ఘన విజయం సాధించింది. యాక్షన్ పార్ట్ తక్కువగా ఉందనే కంప్లయింట్ అభిమానుల నుంచి రావడంతో విడుదలైన కొద్దిరోజులుకు ఎడిటింగ్ లో కట్ చేసిన ఒక ఫైట్ ని మళ్ళీ జోడించారు. నాగార్జున తనలో కామెడీ టైమింగ్ ని ఇందులో పూర్తిగా బయట పెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ క్యాంటీన్ ఓనర్ గా, రెండో సగంలో అత్త ఇంట్లో తిష్ట వేసిన అల్లుడిగా రెండు షేడ్స్ లోనూ కావలసినంత హ్యూమర్ జోడించారు. తోటపల్లి మధు కథ మాటలు మాస్ కి నచ్చే విధంగా వర్కవుట్ అయ్యాయి. మహానటుడు రావుగోపాలరావు గారు చివరి దశలో నటించిన చిత్రాల్లో అల్లరి అల్లుడు ఒకటి. మురళీమోహన్, కోట, సంగీత, చలపతిరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, రాళ్ళపల్లి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇంత విజయవంతమైన అల్లరి చేసిన అల్లుడు 19 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుని నాగార్జున కు మాస్ ఇమేజ్ ని స్థిరపరిచాడు.