అప్పుడప్పుడే దేశం వేగంగా సంస్కరణ ల వైపు అడుగులు వేస్తున్న తరుణం.. భారత దేశంలో క్రికెట్ మీద మక్కువ పెరుగుతున్న రోజులు. క్రికెట్ ఆటనే మాది అని చెప్పుకునే ఇంగ్లాండ్ ఒకపక్క… బలమైన జట్టుగా అందరి చేత గుర్తింపు పొందుతున్న వెస్టిండీస్ మరోపక్క క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని చూపుతున్న రోజులు.. 1983 ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ లో అనూహ్యంగా ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండీస్ అప్పటికే ఫైనల్ లోకి ప్రవేశించి తన ప్రత్యర్థి కోసం వేచి చూస్తోంది. క్రికెట్ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్ మైదానంలో ఫైనల్.
1983 జూన్ 25 ఫైనల్. 60 ఓవర్ల మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ భారత్ బ్యాటింగ్ అప్పగించింది. వెస్టిండీస్ బౌలింగ్ ధాటికి ఒక్కొక్కరుగా వెనుదిరగడం భారత్ బ్యాట్స్మాన్ వంతు అయ్యింది. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, మోహిందర్ అమర్నాథ్, యాసపాల్ శర్మ వంటి ఇండియా టాప్ ఆర్డర్ అంతా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకుండానే వెనక్కు వచ్చేసింది. 54.4 ఓవర్ లలో 183 పరుగులకే ఇండియా ఆల్ అవుట్ అయ్యింది. వెస్టిండీస్ విజయం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో భారత బౌలర్లు సింహాల్లా గర్జించారు.
మోహిందర్ అమర్నాథ్, మదన్ లాల్ తమ బౌలింగు విశ్వ రూపాన్ని చూపించారు. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టారు. అటు బౌలింగ్ లో మరోవైపు ఫీల్డింగ్ లోనూ భారత ఆటగాళ్లు చూపిన తెగువ, వెస్టిండీస్ లాంటి టీమ్ బ్యాటింగ్ లైన్ అప్ ను మెల్లగా దెబ్బతీసి పెవిలియన్ వైపు పంపించారు. అతి స్వల్ప స్కోరు కేవలం 144 రన్స్ కే అవుట్ చేసి ప్రపంచ కప్ మొదటిసారి గెలుచుకున్నారు. కపిల్ నేతృత్వంలో అప్పటి మొదటిసారి చాలా చిన్న టీమ్ గా ఉన్న భారత్ ప్రపంచ కప్ గెలవడం తో ఒక్కసారిగా క్రికెట్ క్రేజ్ ఇండియాలో పెరిగిపోయింది.
ఇండియా క్రికెట్ అప్పటివరకు ఒక ఎత్తయితే, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియాలో ఆల్‌రౌండర్ స్థాయి ఆటగాళ్లు ఎవరూ లేరు అన్న కొరతను కెప్టెన్ కపిల్ దేవ్ తీర్చినట్లు అయింది. వరల్డ్ కప్ లో టీమ్ ను ఫైనల్ కు చేర్చడంలో జింబాబ్వే మీద కపిల్ ఆడిన ఒంటరి పోరు అందరికీ గుర్తుండిపోతుంది. 175 రన్స్ చేసిన కపిల్, బౌలింగ్‌లోనూ అద్భుతమైన స్పెల్ చేసాడు. ఫైనల్లో వెస్టిండీస్ కీలక బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్ క్యాచ్ అందుకున్న తీరు కపిల్ కు ఆసేతు హిమాచలం అభిమానులు అయ్యారు. అప్పట్నుంచి ఇండియన్ క్రికెట్ టీం ఎక్కడికి వెళితే అక్కడ యువత కొలహలం ఉండేది. వారికి సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్ వచ్చి పడింది.
1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్‌లో క్రికెట్ ఒక ప్రత్యేకమైన క్రీడగా వృద్ధి చెదింది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు క్రికెట్ ప్రేమికులు అయ్యారు. క్రికెట్ అనే క్రీడను కెరీర్‌గా మలుచుకునే కుర్రకారు ఎక్కువ అయ్యారు. సచిన్, అజారుద్దీన్ వంటి కొత్త కుర్రాళ్ళు ఇండియా టీంకు రావడానికి క్రికెట్ వరల్డ్ కప్ గెలుపు ఒక స్ఫూర్తి మంత్రంలా పనిచేసింది. 1983 వరల్డ్ కప్ గెలుపు తర్వాత తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ చాలావరకు మార్పు కనిపించింది. పిల్లలను క్రికెట్ ఒక కెరీర్‌గా ఎంచుకునే విధంగా ప్రోత్సాహం పెరిగింది.
1983 తర్వాత క్రికెట్ ఆట విలువ అమాంతం పెరిగింది. క్రికెట్లో రాజకీయాలతో పాటు, ఆర్థిక అంశాలు ఎక్కువయ్యాయి. ప్రతి చిన్న అంశం, క్రికెట్ లో జరిగే చిన్న చిన్న తప్పిదాలు సైతం దేశ ప్రజల్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. సరిగా ఆడని క్రికెటర్ల ఇళ్లపై దాడులు, పాకిస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ఇండియా కి రావడానికి క్రికెటర్లు భయపడని రోజులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రమంగా భారతదేశంలో క్రికెట్ ఒక మతం గా తయారయింది.
1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత మళ్లీ భారత్ కు వరల్డ్ కప్ సాధించిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీ కే దక్కుతుంది. 27 సంవత్సరాల తర్వాత భారత్ ఈ అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచకప్ గెలిచిన భారత్ తర్వాత ఆటలో తడబడింది. అదే సమయంలో ఆస్ట్రేలియా అద్భుతమైన ఆట తీరును కనబరిచి, ప్రపంచపు మేటి జట్టు గా తయారయింది. ముఖ్యంగా 1990 దశకంలో ఇండియా క్రికెట్ జట్టు టాప్ ఆర్డర్ లో రెండు వికెట్లు పడిపోతే తర్వాత బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్ కు వరుస కట్టేవారు అని పేరు ఉండేది.
2000 సంవత్సరం తర్వాత, కొత్త కుర్రాళ్ళ రాకతో భారత్ మెల్లమెల్లగా క్రికెట్లో పుంజుకోవడం మొదలుపెట్టింది. టీ20 ప్రపంచకప్ గెలుపుతో భారత్ ఆత్మవిశ్వాసం పదింతలు అయింది. అదే ఊపుతో 2003లో ప్రపంచ కప్ ఫైనల్ వరకు వెళ్ళిన, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోవడం టీమ్ స్పిరిట్ ను దెబ్బతిసింది. తర్వాత రోజుల్లో టీమ్ లో చేసిన చాలా మార్పులు పనికి వచ్చాయి. దీంతో 2011 ప్రపంచ కప్ ను సొంత గడ్డ మీదనే ధోని సేన కైవసం చేసుకొని 27ఏళ్ల కలను మళ్లీ సాకారం చేసుకుని క్రికెట్ ను గెలిపించింది.