ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 21 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా సోకకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా 13 ప్రత్యేక సబ్ జైళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీచేసింది. 13 జిల్లాలకు 13 ప్రత్యేక కోవిడ్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది.
ఇకపై కోర్టులో శిక్ష పడిన ఖైదీలను ముందుగా ప్రత్యేక జైళ్లకు పంపి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన ఖైదీలను హాస్పిటల్ కు తరలిస్తారు. ఒకవేళ నెగెటివ్ గా తేలితే వారిని కోర్టు సూచించిన జైలుకు పంపనున్నారు. ఈ ప్రత్యేక జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్ అధికారితో పాటు పారా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురం జైళ్లను కొవిడ్ ప్రత్యేక జైళ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ స్పెషల్ జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.