మే 26 నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వ సూచనల మేరకు విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం లభిస్తుంది. రంజాన్ పండుగ ముగిసిన మరుసటి రోజు నుండి కేవలం ఐదారు రోజులలో ఒక సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు పూటలా పరీక్షలు నిర్వహించి నెలాఖరుకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి.
జూన్ మొదటి నుండి పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేపట్టి జూన్ నెలాఖరులోపు ఫలితాలు విడుదల చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరాని సకాలంలో ప్రారంభించటానికి ఇబ్బంది ఉండదని విద్యాశాఖ భావిస్తోంది.అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన పనులను కూడా మే మూడవ వారంలో ప్రారంభించి జూన్ మూడో వారం చివరి నాటికి ఫలితాలను వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు.అయితే పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ సూచనల మేరకు తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని బోర్డు అధికారులు తెలియజేశారు.
వాస్తవానికి ఏపీలో షెడ్యూల్ ప్రకారం మార్చి నెల 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది.కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఒకసారి వాయిదా పడగా,రెండోసారి కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.