iDreamPost

రాజకీయ వ్యూహాల్లో బాబును మించిన జగన్ 

రాజకీయ వ్యూహాల్లో బాబును మించిన జగన్ 

రాజకీయం అంటేనే వ్యూహం, ఎత్తుగడలు. ప్రత్యర్థులకు అందకుండా, ప్రత్యర్థుల అంచనాలకు దొరక్కుండా వ్యూహం రచించడం, దాన్ని అమలుచేయడం రాజనీతి. ఆ వ్యూహాలు సవ్యమైనవి కావొచ్చు, అపసవ్యమైనవి కూడా కావొచ్చు.  యుద్ధంలో ఏదైనా సమర్ధనీయమే. రాజకీయాల్లో కూడా అంతే. తాను అధికారంలో ఉండేందుకు, అధికారం కాపాడుకునేందుకు, అధికారంలో ఉన్నవారిని దించేందుకు ఎలాంటి వ్యూహం, ఎత్తుగడ అయినా సమర్ధనీయమే. అయితే ఆ వ్యూహాల్లో కొంత న్యాయం, నిబద్దత ఉండాలి. ప్రత్యర్థి నిద్రపోతున్నప్పుడు దాడి చేయకూడదు. అలాగే ప్రత్యర్థి నిరాయుధుడు అయినప్పుడు దాడి చేయకూడదు. ఇది రాజనీతి. కానీ రాజకీయాలు అలా ఉండవు. రాజనీతి వేరు రాజకీయం వేరు అన్నట్టుగా మారిపోయింది. రాజకీయాల్లో ఉచ్చ నీచాలు ఉండవు.అవకాశం ఎలాంటిదైనా అందలం ఎక్కేందుకు వాడుకోవడమే. ఇలాంటి రాజకీయాల్లో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరితేరారు అని చెపుతారు. 

ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి అని చంద్రబాబు చెపుతారు కానీ అవకాశంగా మార్చుకోవడానికే సంక్షోభాన్ని సృష్టిస్తూ ఉంటారు చంద్రబాబు. ఆయన రాజకీయాలు తనకు అవకాశం కోసం,తనకు అనుకూలంగానే ఉంటాయి. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా,ఎవరితో కలిసినా,ఎవరిని తనపార్టీలో
చేర్చుకున్నా చివరికి ఎవరిని ప్రత్యర్థి పార్టీలో చేర్పించినా వాటన్నిటినుండీ తనకు అనుకూలమైన అవకాశాలను ఎంచుకుంటారు. ఆదినుండి చంద్రబాబు రాజకీయాలు ఇలాంటివే అని చెపుతారు ఆయనను విద్యార్థిదశనుండి 
చూసినవారు. అలాంటి రాజకీయనేత జగన్మోహన్ రెడ్డి లాంటి నవయువకుడి చేతిలో భంగపాటుకు గురయ్యారు. నాలుగు దశాబ్దాల తన సుదీర్ఘ రాజకీయజీవితంలో తానెప్పుడూ చూడని వ్యూహాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రచించి అమలు చేస్తుంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చంద్రబాబు. జగన్ కొట్టే ప్రతి దెబ్బకూ కోలుకోలేని స్థాయికి పడిపోతున్నారు. 

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రాజధానిపై ఇచ్చిన తీర్పును జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ గా తీసుకున్నట్టు  కనిపించారు. చంద్రబాబుకు నల్లకోటుకు అవినాభావ సంబంధం ఉందనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు కోసం చాలా నల్లకోట్లు నలిగిపోవడానికైనా చిరిగిపోవడానికైనా సిద్ధంగా ఉంటాయని అంటూ ఉంటారు. చంద్రబాబు చొక్కా మడత నలగకుండా చూసుకునేందుకు చాలా నల్లకోట్లు  చిరిగిపోయాయి అని కూడా చెపుతారు. అందుకే చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నల్లకోట్లు యుద్ధరంగంలో జగన్ పై పోరాటం చేస్తున్నాయి. గల్లీ నుండి ఢిల్లీ వరకూ చాలా నల్లకోట్లు చంద్రబాబును కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయింది. చంద్రబాబు నల్లకోట్ల నీడలో సేదదీరుతారని రచ్చబండ చర్చల్లో తెలిసిపోయింది. 

అలాంటి నల్లకోట్లు అమరావతిపై ఓ చిత్ర విచిత్రమైన తీర్పు తెచ్చాయి. రాజధాని నగరాన్ని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర శాసనసభకు లేదని నల్లకోట్లు  చెప్పించాయి. ఒక వైపు రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని, ఈ నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు అని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా కూడా స్పష్టం చేసిన తర్వాత కూడా నల్లకోట్లు కేవలం చంద్రబాబు కోసమే ఇలాంటి విచిత్రమైన తీర్పు రాబట్టగలిగాయి. ఇలాంటి పరిస్థితిని ప్రజలకు మరింత వివరంగా చెప్పాలనే శాసనసభ సమావేశాలను వేదికగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 

అయితే ఇలాంటి చర్చ ప్రమాదకరమైంది కూడా. నల్లకోటు అంటే న్యాయవాదులు మాత్రమే కాదు. న్యాయమూర్తులు, మొత్తం న్యాయవ్యవస్థ నల్లకోటును ప్రతిబింభించే పరిస్థితి ఉన్నందున చర్చలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి న్యాయమూర్తులకు ఆపాదించే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి చర్చకు సరైన “టోన్” సెట్ చేయడం అత్యంత కీలకం. ఎలాంటి వ్యాఖ్యలతో చర్చ మొదలవుతుందో  అలాంటి ఫలితాలే కనిపిస్తాయి. వ్యక్తిగతంగా న్యాయమూర్తుల చిత్తశుద్ధిని ప్రశ్నించే ప్రమాదానికి వెళ్ళకుండా అప్రమత్తంగా ఉండి న్యాయవ్యవస్థను, నల్లకోటును ,మాత్రమే తప్పుపట్టాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయి. 

అందుకోసం జగన్మోహన్ రెడ్డి సరైన వ్యూహమే రచించారు. చర్చకు దిశానిర్దేశం చేసేందుకు సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. రాజకీయ చతురత ధర్మానలో కాస్త మెండుగానే కనిపిస్తుంది. ఆయన మాటకారితనం, చతురత, సునిశిత విమర్శ బాబును కాపాడే నల్లకోటు వ్యవహారాలపై చర్చకు సరైన టోన్ సెట్ చేశాయి. ఇందుకోసం ధర్మాన ప్రసాదరావు చాలా హోమ్ వర్క్ చేసినట్టు కనిపించారు. అనేక కోర్టు తీర్పులను ఉటంకిస్తూ న్యాయవ్యవస్థ, చట్టసభల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా ఉంటుందో మృదువుగా చెప్పారు. న్యాయవ్యవస్థ పై అపారమైన  విశ్వాసం ఉంది అంటూనే వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను ఉటంకించి చిన్న వాతలు పెట్టారు. 

అమరావతి విషయంలో కోర్టు అనుసరించిన విధానంపై అధికార పార్టీలో ఎంత ఉక్రోషం,ఆవేశం,ఆగ్రహం ఉన్నప్పటికీ అవేమీ కనిపించనివ్వకుండా చట్టసభలకు ఉండే అధికారాలు, న్యాయవ్యవస్థ తన పరిధిలోనే ఉండాల్సిన అవసరం చాలా స్పష్టంగా, సూటిగా చెప్పగలిగారు ధర్మాన ప్రసాదరావు. చర్చ ఆరంభంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోయి ఉంటే మిగతా చర్చ మొత్తం దారితప్పి మొత్తం 150 మంది శాసనసభ్యులు ఆవేశంతో, ఆగ్రహంతో ఉగిపోయేవారు. బహుశా అందుకే ఈ సునిశితమైన అంశంపై చర్చ మొదలు పెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగానే ధర్మాన ప్రసాదరావును ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. అందులో జగన్మోహన్ రెడ్డితో సహా కొందరు గట్టి పదజాలం ప్రయోగించినా చర్చ ఫలప్రదంగా ముగిసింది. చర్చ అనేది రాజకీయ అవసరమే అయినా దాన్ని ఆమోదయోగ్యంగా నడిపించడం జగన్ వ్యూహం అయితే ఆ వ్యూహాన్ని సరిగ్గా నడిపించడంలో ధర్మాన విజయం సాధించారు. 

ఈ చర్చ ముగిసిన తర్వాత అటు నల్లకోటు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, చంద్రబాబు మాట్లాడినా అందులో అమరావతి మినహా నిందించేందుకు ఇంకేమీ దొరక్కపోవడం మంచి వ్యుహంగానే చెప్పాలి. మాట్లాడేందుకు చంద్రబాబుకు అనుకూల అంశం దొరక్కుండా చేయడంలో,అదే సమయంలో తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడంలో జగన్ విజయం సాధించారు. జగన్ మాట జనంలోకి వెళ్ళింది. జనం చంద్రబాబు – నల్లకోటు బంధాన్ని అర్ధం చేసుకోగలిగారు. కానీ తప్పుపట్టేందుకు న్యాయవ్యవస్థకు కానీ, చంద్రబాబుకు కానీ సందు దొరకలేదు. అందుకే జగన్ ఈ మూడేళ్ళలో చంద్రబాబు వ్యూహాలను దెబ్బకొట్టడంలో పట్టా పొందారు.

ఇలాంటి వ్యూహాలతో జగన్ ముందుకు వెళితే చంద్రబాబు పైకి లేవడం సాధ్యం కాకపోవచ్చు.ఒక్కసారి కిందపడ్డ ప్రత్యర్థిని పైకి లేవనీయకుండా చూసుకోవడమే మల్లయోధుడి లక్ష్యం. అప్పుడే విజయం సొంతం అవుతుంది.ఈ విషయం అర్ధం కావాలంటే భీముడు కీచకుణ్ణి తుదముట్టించిన మల్లయుద్ధం సీను చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి