iDreamPost

జగ్గారెడ్డి ఏం చెప్పదల్చుకున్నారు..?

జగ్గారెడ్డి ఏం చెప్పదల్చుకున్నారు..?

తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ.. అసమ్మతి రాగం వినిపించడంతో ఇటీవల పార్టీ హైకమాండ్‌ చర్యలకు గురయ్యారు. జగ్గారెడ్డి ఏమి మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తనకు మంత్రి కావాలనే ఆశలేదన్నారు. ప్రభుత్వం (టీఆర్‌ఎస్‌) వచ్చి మంత్రి పదవి ఇస్తానని అన్నా.. తీసుకోబోనని చెప్పారు.

జగ్గారెడ్డి ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనుకుంటే ఎవరు ఆపుతారంటూ మాట్లాడారు. టీపీసీసీ పదవి ఆశించి భంగపడిన జగ్గారెడ్డికి వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ పదవి వచ్చినా.. ప్రాధాన్యత దక్కడంలేదనే అసంతృప్తి ఉంది. ఈ క్రమంలోనే ఆయన రేవంత్‌రెడ్డిపై, పార్టీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌పై తరచూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఫిబ్రవరి నెలలో పార్టీ పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానంటూ రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. తనను టీఆర్‌ఎస్‌ కోవర్ట్‌ అంటూ అవమానిస్తున్నారని పేర్కొంటూ.. త్వరలో రాజీనామా చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత సర్దుకున్నారు. అయితే జగ్గారెడ్డి పరిస్థితి మాత్రం మారలేదు. ఇటీవల సీనియర్‌ నేతలు అందరూ కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరుతో సమావేశం నిర్వహించడం, ఆ సమయంలో జగ్గారెడ్డి మాణిక్యం ఠాగూర్‌ వివక్ష చూపుతున్నారంటూ మాట్లాడడంతో వేటుకు గురయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి.. తనకు మంత్రి కావాలనే ఆశలేదంటూ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గారెడ్డి వ్యవహారశైలే కాదు ఆయన రాజకీయ పయనం కూడా భిన్నమైనదే. బీజేపీ నుంచి ఆయన కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 2004లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీలో చేరి పోటీచేసి గెలిచారు. 2014లో మూడో సారి పోటీ చేసిన జగ్గారెడ్డి.. ఈ సారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ చేతిలో ఓటమిచవిచూశారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వేవ్‌లోనూ మరోసారి జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినా, మంత్రులు అయినా.. జగ్గారెడ్డి మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఆయనకు కాంగ్రెస్‌ పార్టీలోని ఇతర వర్గాల వారు పొగపెడుతుండడంతో తరచూ బరస్ట్‌ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి పయనం కాంగ్రెస్‌లో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి