Idream media
Idream media
పుదుచ్చేరి రాజకీయం రసకందాయంలో పడింది. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలకు జరగబోతున్న తరుణంలో నంబర్ గేమ్ మొదలైంది. నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి నారాయణ స్వామికి తలెత్తింది. ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం కావాలని పుదుచ్చెరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఆదేశాలు జారీ చేశారు.
గురువారం ప్రతిపక్ష పార్టీలు, సీఎం నారాయణస్వామి తమ ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిశారు. ఇరు వైపులా సమానమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తించిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్.. వారితో భేటీ ముగిసిన వెంటనే బలనిరూపణకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అసెంబ్లీలో నారాయణ స్వామి తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాలి.
పుదుచ్చెరి అసెంబ్లీలో 33 మంది శాసన సభ్యులు ఉన్నారు. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కాగా 30 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, మిత్రపక్షం రెండు చోట్ల గెలిచి అధికారాన్ని చేపట్టింది. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా నారాయణ స్వామి ప్రభుత్వానికి మద్ధతిస్తున్నారు. అయితే ఇటీవల పలు దఫాలుగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీకి స్పీకర్‌తో కలుపుకుని 14 మంది సభ్యుల బలం ఉంది.
నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడడంతో ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీలో శాసన సభ్యుల సంఖ్య 28కి చేరుకుంది. నారాయణ స్వామి ప్రభుత్వం నిలబడాలంటే 15 మంది సభ్యులు అవసరం. కానీ స్పీకర్‌తో కలుపుకుని కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వానికి 14 మంది సభ్యులే ఉన్నారు. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంతో పుదుచ్చేరి రాజకీయాలు హీటెక్కాయి. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైన సమయంలో.. నారాయణ స్వామి ప్రభుత్వం పడిపోయినా వేరే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. అయితే ప్రభుత్వం పడిపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయి. ఇది బీజేపీకి కలిసి వస్తుందనే అంచనాలున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారిటీలో పడిన వెంటనే.. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తప్పించి, ఆ పదవిలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను ఇంచార్జిగా నియమించి సంచలనం సృష్టించింది. 2015లో ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన కిరణ్‌బేడీ.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆమెను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గ్ బీజేపీ ప్రభుత్వం నియమించింది. అయితే పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమెను పదవి నుంచి తప్పించడం ఆసక్తికర పరిణామం. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, ఆ వెంటనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను మార్చడం వంటి పరిణామాలు యాదృశ్చికంగా జరిగినవి కావనేది ఓ విశ్లేషణ.