iDreamPost

ప్రధానితో సమావేశానికి కేరళ సీఎం గైర్హాజరు.. కారణం అదేనా..?

ప్రధానితో సమావేశానికి కేరళ సీఎం గైర్హాజరు.. కారణం అదేనా..?

కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్ డౌన్ గడువు మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. మే 3 న ముగియనున్న లాక్ డౌన్ పొడిగించాలా..? లేదా..? అనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఈ సమావేశంలో ప్రధాని మోదీ స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పటికే మూడు సార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశం నాలుగోది కావడం గమనార్హం.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ ఎత్తివేత పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం యావత్తు ఈ సమావేశం పై దృష్టి సారించింది. లాక్ డౌన్ ఎత్తి వేస్తారా..లేదా ..అనే అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇంతటి ముఖ్యమైన సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్ గైర్హాజరవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన తరఫున కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ పై ఇప్పటికే తమ అభిప్రాయాలు, సూచనలు సలహాలు రాతపూర్వకంగా అందించామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అందుకే సీఎం ఈ సమావేశానికి హాజరు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

అయితే దేశం యావత్తు ప్రస్తుతం ఆపత్కాలంలో ఉన్న సమయంలో అత్యంత ముఖ్యమైన ఈ సమావేశానికి పినరయి విజయన్ హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉన్నంత మాత్రాన సమావేశానికి హాజరు కాకుండా ఉండటం సరికాదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆపత్కాలంలో సమైక్యతను చాటాల్సిన తరుణంలో విజయన్ గైర్హాజరు కావడంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి