కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా..: ముద్రగడ

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నా..: ముద్రగడ

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యమం చేయడం వల్ల తాను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోయానని, అయినా కొంత మంది పెద్దలు సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా రోజు తనను తిట్టిస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యమం నుంచి తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన ఆయన ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు.

”నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబుగారే ముఖ్య కారణం. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంతో నష్టపోయానో మీ అందరికీ తెలుసు. కానీ ఏ నష్టానికి నేనెప్పుడు చింతించలేదు.” అని ముద్రగడ పేర్కొన్నారు.

‘‘ ఒకరు దానం అనే పదం నేను రాయడం తప్పు అంట, మరొకరు ఆయన అవకాశవాదుల్లా మాట మార్చొద్దని సలహా ఇస్తున్నారు. ఒకాయన ఇంచుమించుగా కుల ద్రోహి, గజ దొంగ, రకరకాల పదాలతో మాట్లాడారంట, మరొకాయన గతంలో ఒంటి కాలితో లేచేవారు ఇప్పుడు కాళ్లు పడిపోయాయా..? అని రకరకాలుగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఉద్యమం ద్వారా నేనేమి సాధించలేదని రోజూ పేరు చెప్పకుండా పది మందితో తిట్టిస్తూ, తరచూ రోడ్డు మీదకు వచ్చి అరవలేదని, ఫలాలు సాధనలో సరిగా నడవలేదని చెప్పించే వారిని, వారే డ్రైవర్‌ సీటులో కూర్చుని జాతికి నేను తీసుకురాలేని బీసీ రిజర్వేషన్‌ వచ్చే ఏర్పాటు చేయాలని మడుగులో ఉండి ఇతరులు చేత నన్ను తిట్టించే వారిని కోరుకుంటున్నాను’’ అని ముద్రగడ పద్మనాభం తన లేఖలో పేర్కొన్నారు.

Show comments