iDreamPost

కమలం రేకులు రాలుతున్నాయి

కమలం రేకులు రాలుతున్నాయి

ఇక ఎవరికీ సాధ్యం కాదనుకున్న సమయంలో దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత 2014లో సొంతంగా మెజార్జీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఈ ఉత్సాహంతో ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటున్న దక్షిణ భారత రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది. అయితే బీజేపీ ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలుస్తున్నట్లుగా కొత్త రాష్ట్రాలలో అధికారం సంగతి ఏమో కానీ ఉన్న రాష్ట్రాలు బీజేపీ నుంచి ‘చేయి’ జారీ పోతున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి జార్ఖండ్‌ ఎన్నికల వరకు మొత్తం ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయింది.
తాజాగా వెలువడిన జార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల ఫలితాల తర్వాత కమలం నుంచి మరో రేకు రాలిపోయింది. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన బీజేపీకి 25 సీట్లు మాత్రమే దక్కాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌ కూటమి 47 సీట్లు గెలుస్తోంది. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో అధికారం చేపట్టేందుకు కావాల్సిన 41 సీట్ల మార్కును కాంగ్రెస్‌ కూటమి దక్కించుకుంది.


పెద్ద రాష్ట్రాలు ‘చేయి’ జారాయి..

లోక్‌ సభ ఎన్నికలతో పాటు జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. రాజస్థాన్‌లో ఆనవాయితీ ప్రకారం ఆ రాష్ట్ర ప్రజలు అధికారం బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు కట్టబెట్టగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లుగా చెలాయిస్తున్న అధికారానికి గండిపడింది. జార్ఖండ్‌తో పోల్చుకుంటే ఉత్తర భారత్‌లో ఈ రాష్ట్రాలు విస్తీర్ణం దృష్ట్యా పెద్దవి.


లోక్‌సభకు ఇలా.. శాసన సభకు ఇలా..

లోక్‌సభ ఎన్నికల్లో 2014 కంటే 2019 లో దేశ ప్రజలు బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు భిన్నమైన తీర్పును ఇస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు కోల్పోయిన తర్వాత ఆ పరంపర కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యాణా ఎన్నికల్లోనూ బీజేపీకి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచున్నా సీఎం కుర్చి విషయంలో మిత్రధర్మం పాటించకపోవడంతో అధికారం కోల్పోయారు. నమ్మకమైన మిత్రపక్షం శివసేనను దూరం చేసుకోవడంతో, కాపుకాసిఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ అనూహ్య పరిమాణంతో బీజేపీ కంగుతిన్నది. ఇక హర్యానాలో చావుతప్పి కన్నులోట్టపోతున్న సమయంలో దుష్యత్‌ వాలా ఆదుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది.


ముందుంది ముళ్ల బాట..

ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తేయితే ఇక వచ్చే ఏడాదిలో జరగబోయే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు మరొక ఎత్తు. బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీలో అధికారం అందని ద్రాక్షాలనే మిగిలింది. ఆమ్‌ఆద్మీ పార్టీని ఢీకొని ఈ సారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. విద్య, వైద్య సదుపాయాల్లో సమూల మార్పులతో ప్రజల మనస్సును చూరగొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించడం సవాల్‌తో కూడుకున్నది. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి అక్కడ దీదీ అవకాశం ఇస్తుందా..? అన్నది ఆసక్తికరం, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే వరుస ఓటముల నుంచి బీజేపీ ఎంత వేగంగా కోలుకుంటుంది..? లోపాలను సరిచేసుకుని ఎన్నికలకు ఎలా సన్నద్ధమవతుందన్న దానిపై విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి