iDreamPost

జమ్మలమడుగు టీడీపీ కొత్త ఇంచార్జ్ ఎవరు?

జమ్మలమడుగు టీడీపీ కొత్త ఇంచార్జ్ ఎవరు?

రాయలసీమ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. చిత్తూరు మినహా కడప, కర్నూలు, అనంతపురంలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా కడపలో ఓ ప్రత్యేక నియోజకవర్గం ఉంది. కొన్ని దశాబ్దాల ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న ప్రాంతమది. రెండు కుటుంబాల మధ్యపోరుతో అట్టుడికింది. రాష్ట్రంలో అప్పట్లో ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో చెరో కుటుంబం ఉండేవి. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యం చేతులు మారేది. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక పరిస్థితి మారింది. జగన్ దెబ్బకు.. ఒకప్పుడు కత్తులు దూసుకున్న రెండు కుటుంబాలు ఒక్క గూటికి చేరాయి. ఒకే ఒరలో రెండు కత్తుల మాదిరిగా ఒకే పార్టీలో ఉన్నా.. అది మూణ్నాళ్ల ముచ్చటలా మాత్రమే సాగింది. ఇప్పుడు విచిత్రంగా ఒకే కుటుంబంలోని నేతలు.. మూడు పార్టీల్లోకి ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గమేది? ఆ కుటుంబం ఎవరిది?

రెండు కుటుంబాలు.. రెండు పార్టీలు..

సీమలో ఫ్యాక్షన్ అంటే గుర్తొచ్చే ఏరియాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. చదిపిరాళ్ల, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. 1978లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నపురెడ్డి శివారెడ్డి.. జనతా పార్టీ అభ్యర్థి రామనాథ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాతి ఎన్నికల నుంచి 20 ఏళ్లపాటు శివారెడ్డి కుటుంబానిదే జమ్మలమడుగు. శివారెడ్డి 1983,1985, 1989లో టీడీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన హత్యకు గురయ్యారు.

తర్వాత 1994 ఎన్నికల్లో శివారెడ్డి అన్న కొడుకు రామసుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఈ రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి చదిపిరాళ్ల నారాయణ రెడ్డి మీదే గెలిచారు. తర్వాత 2004లో ఆదినారాయణరెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, 2014లో వైఎస్సార్ సీపీ నుంచి ఒకసారి ఇలా వరుసగా మూడు సార్లు రామసుబ్బారెడ్డిపై గెలిచారు. 1983 నుంచి 2004 దాకా పొన్నపురెడ్డి ఫ్యామిలీ.. 2004 నుంచి 2019 దాకా చదిపిరాళ్ల ఫ్యామిలీ హవా కొనసాగించాయి.

Also Read:ఒక తరం భవిష్యత్తును మార్చిన వైఎస్సార్ .. ఒక విద్యార్థి మనోగతం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాకతో..

2014లో కాంగ్రెస్ పార్టీపై ఏపీ అంతటా వ్యతిరేకత రావడంతో చాలా మంది నేతలు.. టీడీపీ, వైసీపీలో చేరారు. ఇలా ఆదినారాయణ రెడ్డి వైసీపీలో చేరారు. జమ్మలమడుగులో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారు. కానీ ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగలేదు. కడపలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పదవులు ఆశజూపి ఆదినారాయణరెడ్డిని చేర్చుకున్నారు. మంత్రి పదవి ఇచ్చారు. దీన్ని రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు నచ్చజెప్పడంతో టీడీపీలోనే సుబ్బారెడ్డి కొనసాగారు. కానీ టీడీపీలో ఉన్నన్నాళ్లూ ముళ్ల కుర్చీ మీద కూర్చున్నట్లే ఫీలయ్యారు.

2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. ఒకరకంగా ఇది ఆత్మహత్యాసదృశ్యమే. ఎందుకంటే కడప.. వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. వైఎస్ ఫ్యామిలీ, లేదా ఆ ఫ్యామిలీ అండ ఉన్న వాళ్లు మాత్రమే గెలుస్తారు. అలాంటి సీటు నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి.. సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. కొన్నాళ్లకే బీజేపీ తీర్థం పుచ్చుకుని, కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన రామసుబ్బారెడ్డి.. అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన కూడా టీడీపీ నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రెండు పార్టీల్లో హవా చూపిన ఇద్దరు నేతలు ముందు ఒక పార్టీలో చేరి.. తర్వాత చెరో పార్టీలోకి వెళ్లిపోయారు.

ముగ్గురు అన్నదమ్ములు తలో పార్టీలో..

వైసీపీ నుంచి ఎన్నికై.. జగన్ ను విమర్శించి విమర్శల కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు ఆదినారాయణరెడ్డి. గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వైసీపీ.. అటు నుంచి టీడీపీ మీదుగా కాషాయ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసిన చదిపిరాళ్ల నారాయణ రెడ్డి.. రామసుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు.

ఆదినారాయణరెడ్డి పార్టీలు మారిన ప్రతిసారి ఆయన సోదరులు కూడా పార్టీమారారు కానీ బీజేపీలో చేరినప్పుడు మాత్రం నారాయణరెడ్డి, శివనాథరెడ్డి టీడీపీలోనే ఉండిపోయారు. నారాయణ రెడ్డి ఒక దశలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగినా జగన్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతారు.

Also Read: పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…

ఇక మరో సోదరుడు శివనాథ రెడ్డి గవర్నర్ కోటాలో గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ విప్ ధిక్కరించి.. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం అని పలుమార్లు మీడియా ఎదుటే చెప్పారు. వైఎస్ కుటుంబంపై అభిమానంతోనే నాడు ఓటేశానని తెలిపారు. వైసీపీలో కొనసాగుతానని ప్రకటించారు. శివనాథరెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

ఇలా అన్నదమ్ములు ముగ్గురూ మూడు పార్టీల్లో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి దాదాపు ప్రధాన పార్టీలన్నింటినీ చుట్టేశారు. చివరిగా బీజేపీ గూటికి చేరారు. అక్కడ కూడా ఆయన కొనసాగుతారా అనేది అనుమానమే. ఎందుకంటే ఏపీలో అది కూడా రాయలసీమలో బీజేపీ ప్రభావం సున్నా. మరోవైపు తన ఫ్యామిలీలో రెండో తరం కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఆది నెగ్గుకొస్తారా?

ఆదినారాయణరెడ్డి బావమరిది,మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ తాతిరెడ్డి సూర్యం ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. 

ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరటంతో ఖాళీ అయినా టీడీపీ ఇంచార్జ్ పదవిని తాత్కాలికంగా పులివెందులకు చెందిన బీటెక్ రవికి ఇచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయి ఇంచార్జ్ ను నియమించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న దశలో నారాయణరెడ్డి కొడుకు భూపేష్ పేరు తెరమీదికి వచ్చింది. 

జమ్మలమడుకు టీడీపీ ఇంచార్జ్ బాధ్యతలు భూపేష్ రెడ్డి పేరు టీడీపీ రేపు అధికారికంగా ప్రకటించవచ్చు ?అయితే ఎన్నికల నాటికి ఆదినారాయణరెడ్డి తిరిగి టీడీపీ గూటికి చేరుతారా? ఆయనే అభ్యర్థి అవుతాడా?వేచి చూడాలి..

ఆదినారాయాణ రెడ్డి గతంలో భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడని ప్రకటించాడు కాబట్టి భూపేష్ నే పోటీకి దించుతారో చూడాలి.

Also Read :  వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?