iDreamPost

ఆర్మీ అద్భుతం.. 3 గంటల్లోనే 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి సిద్ధం

ఆర్మీ అద్భుతం.. 3 గంటల్లోనే 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి సిద్ధం

గత కరోనా సమయంలో వైరస్ ను కట్టడి చేసేందుకు వారం రోజుల్లోనే చైనా వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించడాన్ని అప్పట్లో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఈ విషయంలో మనమూ ఏం తక్కువ కాదని మన సైన్యం తన చేతలతో నిరూపించింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశం కష్టాల్లో పడిన సమయంలో నేనున్నానంటూ పలు ప్రాంతాల్లో సేవా, సహాయ కార్యక్రమాలతో స్థానిక అధికార వర్గాలకు అండగా నిలుస్తున్న సైనికదళం మూడంటే మూడు గంటల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన వంద పడకల ఆస్పత్రిని సిద్ధం చేసి అధికారులకు అప్పగించి ఔరా అనిపించుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ లో ఆర్మీ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

కేసులు అపరిమితంగా పెరగడంతో..

బార్మర్ జిల్లాలో గత కొద్దిరోజుల్లో కోవిడ్ కేసులు బాగా పెరిగాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత అక్కడ ఇప్పటివరకు 7785 కేసులు నమోదయ్యాయి. 95 మరణాలు సంభవించాయి. ఆ జిల్లాలో కరోనా చికిత్సకు జిల్లా ప్రధాన ఆస్పత్రి ఒక్కటే ఆధారం. అందులోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకల సంఖ్య తక్కువ. రోగులు పెరుగుతుండటంతో ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో జిల్లా అధికారులు ఆస్పత్రి ఏర్పాటు చేయమని సైన్యాధికారులను అర్థించారు. ఇప్పటికే కరోనా సహాయ చర్యల్లో పలు ప్రాంతాల్లో సివిల్ అధికారులకు చేయుతనిస్తున్న సైన్యం బార్మర్ అధికారుల అభ్యర్థనకు అంగీకరించింది. కమాండింగ్ ఆఫీసర్ బ్రిగేడియర్ సలీల్ సేథ్ నేతృత్వంలో రంగంలోకి దిగింది.

ఆపరేషన్ హాస్పిటల్ సక్సెస్

రెండు రోజుల క్రితం సాయంత్రం జిల్లా అధికారులు సాయం కోరగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో రంగంలోకి దిగిన 40 మంది జవాన్లు మొదట జైసల్మేర్ రోడ్డులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని ఆస్పత్రిగా మార్చారు. అయితే జిల్లా ప్రధాన ఆస్పత్రికి అది చాలా దూరంలో ఉండటంతో వైద్యులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అధికారుల విజ్ఞప్తి మేరకు ప్రధాన ఆస్పత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఆస్పత్రిగా మార్చారు. ఆక్సిజన్ సిలెండర్లతో సహా వంద పథకాలను ఇంజనీరింగ్ కళాశాల నుంచి యుద్ధప్రాతిపదికన షిఫ్ట్ చేశారు. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రిని మూడు గంటల్లోనే సిద్ధం చేసి జిల్లా అధికారులకు అప్పగించారు. భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న బార్మర్ జిల్లాలో సరిహద్దు రక్షణ బాధ్యతల్లో నిమగ్నమైన దేశ సైనికదళం ఎప్పుడు అవసరమైనా సేవ, సహాయ కార్యక్రమాలతో పౌర అధికారులకు అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

Also Read : యువతకు వ్యాక్సిన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి