iDreamPost

ఏపీలో ఏడాది వరకు తిండి గింజలకు ఢోకా లేదు..

ఏపీలో ఏడాది వరకు తిండి గింజలకు ఢోకా లేదు..

కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఆహారా ధాన్యాలను సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు 16.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. బియ్యం, గోధుమలు, కందిపప్పు, శనగలు వీటిలో ఉన్నాయి. వీటితో ఏడాది పాటు సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేయవచ్చు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నందున ‍ప్రభుత్వం నెలలో ఏకంగా మూడు సార్లు రేషన్‌ ఉచితంగా ఇస్తున్న విషయం తెలిసిందే. మార్చి 29న, ఏప్రిల్‌ 15న ఇప్పటికే 1.47 కోట్ల తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్‌ 29 నుంచి మూడో విడత పంపిణీ ప్రారంభం కానుంది.

ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తున్నారు. బియ్యం కార్డు లేకపోయినా.. తమకు రేషన్‌ అవసరముందని ఎవరైనా అడిగితే లేదనకుండా ఉచితంగా సరకులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అదనంగా 70వేల కుటుంబాలు లబ్ధి పొందాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 92 లక్షల కుటుంబాలను మాత్రమే గుర్తించి కేంద్రప్రభుత్వం వారికే బియ్యం కేటాయిస్తోంది. మిగిలిన 55 లక్షలపైగా ఉన్న కుటుంబాలకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి పేదలకు బియ్యం, పప్పు పంపిణీ చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందుల దృష్టా‍్య 55 లక్షల కుటుంబాలకు కూడా బియ్యం ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం అందుకు అంగీకరించకపోవడంతో అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 55 లక్షల పేదలకు రాష్ట్రం అందిస్తున్న సరుకులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రీ బ్యాక్‌ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ను కోరారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు శరవేగంగా సాగుతోంది. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి