iDreamPost

Iddaru Mitrulu : నీరసం తెప్పించిన మెగా మిత్రులు – Nostalgia

Iddaru Mitrulu : నీరసం తెప్పించిన మెగా మిత్రులు – Nostalgia

స్టార్లతో కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు మాస్ ఎలిమెంట్స్ ని చెక్ చేసుకోవడం చాలా అవసరం. హీరోకు ఇమేజ్ మార్కెట్ ఉన్నాయి కదాని తోచిన కథతో తీస్తే ఫలితాలు గోవిందా కొట్టేస్తాయి. అదెలాగో చూద్దాం. 1995లో వరుస పరాజయాల తర్వాత చిరంజీవి తన ఎంపికను పునఃసమీక్షించుకోవడం కోసం ఏడాది గ్యాప్ తీసుకోవడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఆ కారణంగానే హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా లాంటి హ్యాట్రిక్ సూపర్ హిట్స్ పడ్డాయి. స్నేహం కోసం వాటి స్థాయిలో కాకపోయినా డీసెంట్ సక్సెస్ అందుకుని వంద రోజులు ఆడేసింది. అప్పుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబోలో ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు చిరు.

ఈ ఇద్దరి కలయిక అనగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు జగదేకేవీరుడు అతిలోకసుందరి-ఘరానా మొగుడు. ఇండస్ట్రీ రికార్డులను పాతరేసిన ఈ రెండు క్లాసిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తర్వాత వచ్చిన ముగ్గురు మొనగాళ్లు అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్ గా బయ్యర్లను గట్టెక్కించింది. అందుకే 1999లో మరోసారి జట్టు కట్టాలని నిర్ణయించుకున్నారు. ముఠామేస్త్రి, మాస్టర్ లాంటి సంచలనాత్మక కథలు అందించిన భూపతిరాజా ఇచ్చిన స్టోరీతో అప్పటిదాకా కామెడీ బ్లాక్ బస్టర్స్ తో పేరు తెచ్చుకున్న రైటర్ దివాకరబాబుతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు రాఘవేంద్రరావు. సంగీత దర్శకుడంటే మణిశర్మ తప్ప మెగాస్టార్ వేరే ఛాయస్ పెట్టుకోలేదు

రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా ఎంపిక కాగా మరో ప్రధాన పాత్రకు సురేష్ ని తీసుకున్నారు. గతంలో స్నేహితుడిగా, తోడల్లుడిగా చిరుతో నటించిన చంద్రమోహన్ ఇందులో తండ్రిగా చేయడం ట్విస్టు. ఆడా మగ మధ్య స్నేహంలో అపార్థాలకు తావు లేదన్న పాయింట్ తో రూపుదిద్దుకున్న ఈ ఎంటర్ టైనర్ కనీసం అభిమానులను సైతం అలరించలేకపోయింది. ఫ్రెండ్ షిప్ పేరుతో చూపించిన ఓవర్ డ్రామా, సాక్షి శివానంధ్ లాంటి గ్లామరస్ బ్యూటీని సురేష్ కి భార్యగా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. క్లైమాక్స్ మరీ నవ్వుకునేలా గ్రాఫిక్స్ లో రన్నింగ్ ట్రైన్ ముందు చిరంజీవిని పరిగెత్తించిన తీరు మాస్ కే చిరాకు పుట్టించింది. దెబ్బకు 1999 ఏప్రిల్ 30 రిలీజైన ఇద్దరు మిత్రులుకు డిజాస్టర్ తప్పలేదు.. ఒక మంచి అక్కినేని క్లాసిక్ టైటిల్ ఇలా వృథా అయిపోయింది.

Also Read : Lakshmi Narasimha : పోలీస్ నరసింహగా బాలయ్య విశ్వరూపం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి