iDreamPost

ఇండియా, భారత్.. రెండిట్లో ఏ పేరు మంచిది? అసలు చరిత్ర!

ఇండియా, భారత్.. రెండిట్లో ఏ పేరు మంచిది? అసలు చరిత్ర!

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చబోతోందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జీ20 సమావేశాల ఆహ్వాన పత్రికలో ‘‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’’కు బదులు ‘‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’’ అని ఉండటం ఈ ప్రచారాలకు బలం చేకూరుస్తోంది. ఇక, పేరు మార్పుకు సంబంధించి మరి కొద్దిరోజుల్లో పార్లమెంట్‌లో బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇండియా పేరు మార్పుపై గత కొద్దిరోజుల నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర ‍ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు పోటాపోటీగా దీనిపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. పేరు మార్పుపై జరుగుతున్న రచ్చ.. గొడవల సంగతి పక్కన పెడితే.. చరిత్రలో ఎన్నో పేర్లతో పిలవబడ్డ ఈ ఉపఖండానికి ‘‘ భారత్‌’’ అనే పేరు ఎప్పుడు వచ్చింది? దాని చరిత్ర ఏంటి?…

పురాణాల్లో భారత్‌ ప్రస్తావన!

ఈ ఉపఖండం చరిత్రలో చాలా పేర్లతో పిలువబడింది. ఎన్ని పేర్లు ఉన్నప్పటికి మూడు పేర్లు ఇప్పటి వరకు కూడా వాడుకలో ఉన్నాయి. భారత్‌, హిందుస్తాన్‌, ఇండియా. అయితే, వీటిలో భారత్‌ అనే పేరుకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాలు, వేదాల్లోనూ భారత్‌ పేరు ప్రస్తావన ఉంది. ఈ ఉపఖండానికి భారత్‌ అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై ఓ స్పష్టత లేదు. భారత దేశాన్ని భరతుడు పాలించటం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతున్నా.. పురాణాల్లో భరతుడు అనే పేరుతో చాలా మంది ఉన్నారు. వారిలో దుష్యంతుడి కుమారుడు.. దశరథ పుత్రుడు.. నాట్యశాస్త్రంలో భరతముని.. రాజర్షి భరత్ ఇలా చాలా మంది పేర్లు ఉన్నాయి.

అయితే, దుష్యంతుడి కుమారుడు భరతుడి పేరు మీదగానే భారత్‌ అన్న పేరు వచ్చినట్లు ‘ఐతరేయ బ్రాహ్మణం’లో ఉంది. దుష్యంతుడి కుమారుడైన భరతుడు చక్రవర్తిగా మారి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అశ్వమేథ యజ్ఞం సైతం చేశాడు. ఆ కారణంగానే ఆయన పేరు మీదగా ఆ రాజ్యానికి ‘భరతవర్ష’ అన్న పేరు వచ్చిందని ‘ఐతరేయ బ్రాహ్మణం’ చెబుతోంది. కానీ, భరతుడికి ముందు నుంచే భరతజనులు అన్న పేరు ఉందని చరిత్ర కారులు భావిస్తున్నారు. భారత్‌ అన్న పదం వ్యక్తుల నుంచి కాకుండా.. జాతి నుంచి వచ్చిందన్న వాదన కూడా ఉంది. భరతజనులు నివసించిన ప్రాంతం కాబట్టి.. దీనికి భారత్‌ అన్న పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

భరత్‌ అంటే ఏమిటి?

సంస్కృతంలో ‘భర్‌’ అంటే యుద్ధం, సమూహం లేదా జనగణం, నిర్వహణ అనే అర్థాలు ఉన్నాయి. ఆర్య చరిత్రలో కూడా భరత జనుల వృత్తాంతం ఉంది. భారత్‌ అనే పదాన్ని ఒక్కోసారి యుద్ధం, అగ్ని, సంఘానికి సమానంగా వాడే వారు. నిరంతరం అగ్నిని పూజించే వారు కాబట్టి ఈ ఉపఖండంలోని జనాలకు భరతజనులు అన్న పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. అందుకే.. భరత్‌, భారత్‌ అనే పదాలు అగ్నికి విశేషణాలుగా మారాయి.

మహాభారతానికి ముందునుంచే భారత్‌..

ద్వాపర యుగంలో.. అంటే ఇప్పటికి 9 వేల ఏళ్ల క్రితం నుంచే భారత్‌ అన్న పదం వాడుకలో ఉంది. అది కూడా మహా భారత యుద్దం జరగటానికి దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నుంచే భారత్‌ అన్న పేరు ఉంది. మహాభారత యుద్ధం జరగటానికి 2500 సంవత్సరాల క్రితం పది రాజుల యుద్ధం జరిగింది. ఆ సమయంలో యజ్ఞప్రియులు, అగ్ని హోత్రుల పేరు ప్రస్తావించబడింది. ఓ జాతి సరస్వతి నది లేదా ఇప్పటి ఘగ్ఘర్ ఒండ్రునేలల్లో నివసిస్తూ ఉండేది. ఆ జాతే భరత జాతి. ఆ జాతిలోని వారిని భరత జనులు అనేవారు. వారు నివసించిన ప్రాంతాన్నే ‘భరతవర్ష్‌’అని పిలిచేవారు. పండితుల ప్రకారం ఈ జాతికి సుదాసుడు అధిపతిగా ఉండేవాడు. ఇతడికి వ్యతిరేకంగా పది జాతులు యుద్ధం చేశాయి. ఆ యుద్ధాన్నే దశరాజ్ఞ్‌ లేదా పరి రాజుల యుద్ధం అంటారు. ఈ యుద్ధం మహాభారత యుద్ధానికి 2500 ఏళ్లకు పూర్వం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఇండియా అన్న పేరు ఎలా వచ్చింది!

భరత ఖండంలోకి బ్రిటీష్‌ వాళ్లు అడుగుపెట్టే వరకు కూడా భారత్‌, హిందుస్తాన్‌ అన్న పేర్లు బాగా వాడుకలో ఉండేవి. బ్రిటీష్‌ వాళ్లు రాకముందు నుంచి భారత ఖండాన్ని ఇండియా అన్న పేరుతో పిలిచే వారు. చరిత్ర కారుల ప్రకారం.. ఇండియా అన్న పేరు ఇండస్‌( సింధూ నది) పేరు మీదగా వచ్చింది. ఇది ఇంగ్లీష్‌ పదం. ఇండియా అనే పదాన్ని క్రీస్తుశకం 2వ శతాబ్ధంలో లూసియాన్‌ వాడాడు. 886నుంచి 899 వరకు ఆంగ్లో సాక్సాన్‌ ప్రాంతాన్ని పాలించిన ఆల్ప్రెడ్‌ ది గ్రేట్‌ కాలంలోనూ ఇండియా అన్న పదం వాడుకలో ఉండేది. తర్వాత ఫ్రెంచ్‌ ప్రభావం కారణంగా ఇండియా పేరు ఇండీగా రూపాంతరం చెందింది. తర్వాత 17వ శతాబ్ధంలో మళ్లీ ఆంగ్ల పదం ఇండియా వాడుకలోకి వచ్చింది.

1400లలో కోలంబస్‌ ఇండియాను కనుగొనాలన్న ఉద్దేశ్యంతో సముద్రంలో పడవ ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో ఆయన ఇండియాకు కాకుండా అమెరికాలోకి అడుగుపెట్టారు. తాను ఇండియాలో లేనని తెలుసుకున్న ఆయన అమెరికాలో తాను చూసిన ప్రజలకు ‘రెడ్‌ ఇండియన్స్‌’అన్న పేరు పెట్టాడు. ఇప్పటికి అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలకు ‘రెడ్‌ ఇండియన్స్‌’ అన్న పేరు ఉంది. బ్రిటీష్‌ వారు భారత దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లీష్‌ను ఎక్కువ వాడుకలోకి తెచ్చారు.

ఇండియా అన్న ఆంగ్ల పేరునే అధికారికంగా వాడుకలోకి తెచ్చారు. అప్పటినుంచి ఇండియా అన్న పదమే ఎక్కువగా వాడుకలో ఉంటోంది. ఇక, 28 ప్రతి పక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ అన్న పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమిని దెబ్బతీసేందుకు రాజకీయ కోణంతో కేంద్రం ఇండియా పేరు మార్పును వేగవంతం చేసినట్లు.. హుటాహుటిన దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి, కేంద్రం ఇండియా పేరును భారత్‌గా మార్చటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి