కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్ట్ బ్రేక్! ఆ 4 ప్రశ్నలు తొలగించాలంటూ..

కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్ట్ బ్రేక్! ఆ 4 ప్రశ్నలు తొలగించాలంటూ..

  • Author Soma Sekhar Published - 08:20 AM, Tue - 10 October 23
  • Author Soma Sekhar Published - 08:20 AM, Tue - 10 October 23
కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్ట్ బ్రేక్! ఆ 4 ప్రశ్నలు తొలగించాలంటూ..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని, మాకెందుకు రాలేదని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్ట్ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్ ఇచ్చింది. సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ లకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. మళ్లీ జవాబు పత్రాలను మూల్యాంకన చేసి తుది జాబితాను ప్రకటించాలని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది ఏప్రిల్ 25న 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. అయితే ఈ రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలను తెలుగులో అనువదించకపోవడంతో పాటుగా.. కొన్ని తప్పుగా ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు వాటిని తొలగించాలంటూ నియామక మండలికి ఫిర్యాదు చేశారు. కానీ వారి విన్నపాలను పట్టించుకోకపోవడంతో.. హైకోర్ట్ లో 6 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్ట్.. ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తన తీర్పును వెలువరిస్తూ.. ప్రశ్నాపత్రంలోని తెలుగులోకి అనువదించని 122, 130, 144 ప్రశ్నలతో పాటు అచ్చుతప్పు ఉన్న 57వ ప్రశ్నను కూడా తొలగించి.. మళ్లీ తుది జాబితాను ప్రకటించాలని పోలీస్ నియామక మండలికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ తాజాగా వెలువరించిన తీర్పుతో అభ్యర్థులతో పాటుగా, నియామక మండలి అయోమయంలో పడింది.

Show comments