iDreamPost

గోదారి పుంజులు

గోదారి పుంజులు

“వచ్చేసేడూ.. ఏటా ఠంఛనుగా వచ్చి వాయించుతాడు. వేరే పనేం లేదు..చలి మొదలై.. ఈ సౌండినపడిందంటే.. గుండెల్లో.. రైళ్ళు పరిగెడతాయ్. ఈ హరిదాసుకి అసలు పనే ఉండదు”. గంగిగోవులాంటి హరిదాసుని తిట్టుకోడానికి నాకు నోరెలా వచ్చిందీ అనుకుంటున్నారు కదా. అసలు ముందు నేనెవరో తెలియాలి మీకు. మామూలూ రోజుల్లో… కంచంలోకి, ఇలాంటి రోజుల్లో బరిలోకి బలైపోయే కోడి జాతి పుంజుని నేను. కోడిపుంజంటారు లేండి. ఇలాంటి రోజుల్లో అయితే.. పరువూ ప్రతిష్ట అని కూడా అంటుంటారు. అవన్నీ శవానికి చేసే అలంకారాల వంటివి. ఉపయోగం లేదు.

గంప కింద మూసేసున్న నాకూ.. నోరు తెరిచి పాట పాడే హరిదాసుకి వైరఁవేంటనా మీ డౌటు. అతనితో నాకు గొడవేం ఉంటాదండీ బాబూ.. ఏం లేదు. కానీ అతనొచ్చి వాయించే తుంబురా సౌండింటే మాకు ప్రమాద ఘంటికలు మోగినట్టే. పండక్కొచ్చే జనం ఊరు దగ్గరకొస్తుందని ఎంత ఆనందపడతారో.. పండగ నెల పట్టాకా పండగ రోజులు దగ్గరకొస్తున్నాయంటే మాకూ అంతే భయం.

అసలు మేము కోడి జాతిలో పుట్టాం అనుకోండి.. పెద్ద ఇబ్బంది లేదు. కానీ పుంజుగా పుడితేనే రెండిబ్బందులు. యాపీగా ఇండియాలో ఎక్కడైనా పుట్టేం అనుకోండి, అసలు గొడవే లేదు. కానీ ఆంధ్రా ఏరియాలో పుడితేనే మళ్ళీ రెండిబ్బందులు. యే పెట్టగానో పుట్టేం అనుకోండి, యే బిర్యానీలోనో కలిసిపోవచ్చు. కానీ పుంజుగా పుడితే మళ్ళీ రెండిబ్బందులు. ఈ పుంజు గోదారిలో కాకండా ఇంకెక్కడైనా అనుకోండి, ఫుల్లు హ్యాపీసు. అలా కాకుండా గోదారి జిల్లాల్లో పుడితే మళ్ళీ ఇంకో రెండిబ్బందులన్న మాట. అయ్యేంటంటే.. మమ్మల్ని కూరలోకి వండుతారా బరిలోకి దింపుతారా అని. ఇన్నిరకాల ఇబ్బందులు పెద్ద పెద్ద పక్షిజాతులక్కూడా లేవండీ బాబూ!!

ఎక్కడైనా బలిచ్చే మటన్ మేకని మేపుతారూ అని మీరినుంటారు కదా. కానీ ఇక్కడ రివర్సు. మమ్మల్ని మేపుతారు. ఆ మేపడం కూడా ఎలా ఉంటాదో తెలుసా? జీడిపప్పూ బాదం పప్పూ పిస్తా పప్పూ.. కుదిరితే బ్రాందీ, నాటు సారా.. తస్సాదియ్యా మా పని ఎలా ఉంటాదంటే.. అపుడే వచ్చిన కొత్తల్లుడిక్కూడా ఈ రేంజి మర్యాదలుండవ్ అన్నమాట. అసలు కోడి చికెన్లమైన మాకు.. మేక మటన్ నుంచి కైమా తీసి, దోరగా యేపి ఉండలు చేసి పెడతారు తెలుసా? అదేదో సినిమాలో.. “కోడి గుడ్డెలా తింటుందండీ బాబూ” అనడిగితే.. “ఆమ్లెట్ వేసి పెట్టవయ్యా అంటారు కదా” అలాంటి ఆమ్లెట్లు జీడిపప్పేసి మరీ పెడతారు మాకు. మా యజమాని గారు కూడా ఎప్పుడూ అలా తిని ఉండరు.

నిన్నటి వరకూ హరిదాసుని తిట్టుకుంటా ఉండేదానిని, రోజులు దగ్గరకొచ్చేసేయ్ అని. మమ్మల్ని కూడా సిమెంటు కుండీల్లో నీళ్ళేసి ఈతలూ, ఇసుక నేల మీద వాకింగులూ చేయించి తొడలు గట్టి పడేలా, రెక్కలు బలపడేలా ట్రైనింగిచ్చేసారు కానీ.. చావుకి భయపడకండా ఎలా ఉండాలో మాత్రం ట్లైనింగివ్వలేదు. మాదీ ప్రాణమే.. అదీ తీపే కదండీ ఎంతైనా! నిన్న తెల్లారుఝామున యెచ్చగా వేడి తగిలినపుడే అనుకున్నా.. భోగి వచ్చేసింది. రోజులు దగ్గరకొచ్చేసేయ్ అని.

నిన్న సాయంత్రమే.. మా దగ్గర పనిచేసేవోడు పెద్ద ఫ్లెక్సీ కూడా తెచ్చి కట్టేడు సంక్రాంతి కోడి పందేలూ అని . నా చావుకి ఇన్విటేషన్‌లా ఉందది. అయిదేళ్ళ క్రితం మా నాన్నిలాగే.. సంక్రాంతి రోజులా ఠీవీగా పుంజులా బయటకెళ్ళి, రాత్రికి మా యజమాని గారి ఇంట్లో చుట్టాలకి పందెంకోడి ఇగురులా మారిపోయాడు. కాపోతే యెళ్ళే ముందు మాత్రం.. “ఎవరికీ దక్కని అదురుస్టం మన జాతికి పట్టిందిరా… మన ఓండ్రు గారు అరవై లక్షలేసి యేసిన రెయ్యల చెర్వులో పిల్ల ఎదిగినపుడు కూడా ఆనందపడడు కానీ.. మన తొడ కొంచెం పెరిగిందంటే మాత్రం ఎగిరి గంతేత్తాడూ.. మ్మరి ఆయన పరువు నిలబెట్టాలంటే మనం ప్రాణాల్ని లెక్కచేస్తే.. ఎలారా కొక్కొరొకో…” అని ఓ తెల్లారి కూసేసి ఎల్లిపోయాడు. ఆ రోజే ఆయన జీవితానికి చీకటడిపోయింది. అది వేరే విషయం అనుకోండి.

ఇదిగో.. ఇదిగో.. నన్ను పట్టుకుంటున్నారు. అంటే నెక్స్ట్ నేనే. పొద్దున్నే పోలీసోళ్ళు పందేలు ఆపేత్తారూ అని ఎవరో అన్నారు. కానీ ఆళ్ళు కనపడట్లేదు. జగనన్న వచ్చేడు కదా.. ఈ యేడు మన రాత మారతాదేమో అనుకున్నాను. పాపం ఆయన మాత్రం సంప్రదాయ క్రీడల్ని ఎలా ఆపగలడు. ఈడేంటీ నా కాలికి కత్తి కట్టేస్తున్నాడు. ఉండరారేయ్. కనీసం డింకీ పందేలకన్నా పంపరా. ఓపికున్నంత వరకూ కొట్టుకుంటాం. కత్తి కడితే పది నిమిషాల్లో ప్రాణాలు పోతాయిరా బాబూ.. నా మాటినరా.

ఇంతోటి నన్ను చూడటానికి సిటీల నుండి కూడా జనం వచ్చేరంట. ఈళ్ళేంటీ కళ్ళ జోడెట్టుకుని మరీ నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు. నేనేమైనా సెలబ్రిటీనా? వదలరా బాబూ పందెంలోకి దిగాలి. ఏంటో ఇంతకాలం కింగులా బతికాను. ఇపుడేమవుద్దో.. బతికినా కూడా సుకం ఉండదు. ఒంటి నిండా దెబ్బలే. ఫస్ట్ ఎయిడ్ కింద పసుపు రాసి చేతులు దులిపేసుకుంటారు. ఇన్నాళ్ళ ప్రేమా ఏమయిపోద్దో ఏంటో. అదిగో అతనెవరో చేతిలో ఉన్న నోట్లన్నీ నా వైపే కోసు పందేనికి దిగుతున్నాడు. నాకు మరి విజయమో… వేడి తైలమో.. తేల్చుకుని మళ్ళీ వస్తా.. ఉంటానండీ!!! బతికుంటే వచ్చే సంక్రాంతికి మళ్ళీ బరిలో కలుసుకుందాం!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి