iDreamPost

Godfather గాడ్ ఫాదర్ రివ్యూ

Godfather గాడ్ ఫాదర్ రివ్యూ

నూటా యాభైకి పైగా సినిమాల సుదీర్ఘ ప్రస్థానంలో చిరంజీవి చూడని ఎత్తుపల్లాలు హిట్లు ఫ్లాపులు లేకపోయినా ఆచార్య ప్రభావమో మరో కారణమో చెప్పలేం కానీ మొత్తానికి గాడ్ ఫాదర్ మీద ముందు నుంచి ఉండాల్సిన స్థాయిలో హైప్ లేదన్నది వాస్తవం. దానికి తోడు నిర్మాణ సంస్థ నిదానంగా చేసిన ప్రమోషన్లు ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టగా, మలయాళం లూసిఫర్ రీమేకనే ప్రచారం దీనికి మేలు కంటే చెడే చేసిందన్న మాట వాస్తవం. ఇన్నేసి విభిన్న అంచనాల మధ్య మెగాస్టార్ మూవీ రావడం చాలా అరుదు. కొణిదెల హోమ్ ప్రొడక్షన్ తో పాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూసేద్దాం

కథ

అధికారంలో ఉన్న జనజాగృతి పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పికెఆర్(సర్వదమన్ బెనర్జీ)హఠాత్తుగా చనిపోవడంతో ఆ కుర్చీ మీద జిత్తులమారి అల్లుడు జైదేవ్(సత్యదేవ్)కళ్ళు పడతాయి. హోమ్ మినిస్టర్(మురళీశర్మ)అండతో దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉండగా రాజకీయాలకు దూరంగా అజ్ఞాతంలో ఉన్న సిఎం కొడుకు బ్రహ్మ(చిరంజీవి)అతనికి అడ్డుపడతాడు. తనను ఇష్టపడకపోయినా చెల్లి సత్యప్రియ(నయనతార)కు అండగా ఉండటం కోసం జైలుకు వెళ్లేందుకు సైతం వెనుకాడడు. ఈ క్రమంలో కుటుంబంతో పాటు సామాజికంగా బ్రహ్మ ఎన్నో సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ పద్మవ్యూహంలో ఎలా గెలిచాడనేదే తెరమీద చూడాలి

నటీనటులు

చిరంజీవి సినిమా అంటేనే ఒక సెలబ్రేషన్. దశాబ్దాలు గడుస్తున్నా అభిమానులకు ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ మార్కెట్ కి కొత్త ఓనమాలు దిద్దించిన మెగాస్టార్ నటన గురించి కొత్తగా వర్ణించేందుకు చెప్పేందుకు ఏం లేదు. ఇంత వయసులోనూ ప్రేక్షకులను అలరించడానికి కష్టపడుతున్న తీరు ఇందులోనూ కనిపించింది. ముఖ్యంగా ఓవర్ ది బోర్డ్ హీరోయిజం లేకుండా కేవలం కంటిచూపు, నడక, హావభావాలతో మెప్పించిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఫైట్లలో మాస్ కోసం కొన్ని స్టంట్లు చేయించినా ఓవరాల్ గా చెప్పాలంటే తమ అభిమానధనుడిని జనం ఎలా చూడాలనుకుంటున్నారో అలా మాత్రం ఉన్నారు.

నయనతార పాత్ర కోరుకున్న గాంభీర్యాన్ని నిండుగా ప్రదర్శిస్తూ పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకుంది. వేరే సీనియర్ ఆర్టిస్టుతో చేయించినా నడిచేది కానీ ఆడియన్స్ కి ఎమోషన్ కనెక్ట్ చేయడం తనవల్ల దర్శకుడికి మరింత సులువయ్యింది. సత్యదేవ్ గురించి హీరో దర్శకుడు చెప్పిన మాటలు అతిశయోక్తి కాదు. ఒరిజినల్ లో చేసిన వివేక్ ఒబెరాయ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కూల్ విలనిజం ప్రదర్శించాడు. మురళీశర్మ, సునీల్, షఫీ, బ్రహ్మాజీ, అనసూయ, బిగ్ బాస్ దివి తదితరులవి కొత్తగా చెప్పుకునేవి కాదు కానీ వాళ్ళను వాడుకున్న తీరు బాగుంది. సముతిరఖని స్త్రీలోలుడైన పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు.సల్మాన్ ఖాన్ ని సరిగా వాడుకోలేకపోవడం మైనస్సే

డైరెక్టర్ అండ్ టీమ్

ఒక భాషలో బ్లాక్ బస్టరైన సినిమాని రీమేక్ చేయడం చూసినప్పుడు సులభమే అనిపిస్తుంది కానీ నిజానికిది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఏ మాత్రం తేడా కొట్టినా ఏ చిన్న అంశం బ్యాలన్స్ తప్పినా అంచనాలు తారుమారైపోతాయి. అందుకే రెండింట్లో హీరో ఒకడే అయినా గబ్బర్ సింగ్ సాధించిన రికార్డులు భీమ్లా నాయక్ ని వరించలేదు. అది సబ్జెక్టుని బట్టి దర్శకుడి దాన్ని ఎలా ఆవిష్కరించాలనే ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ చేసిన లూసిఫర్ చూసినప్పుడు ఇది తనకు సూటవుతుందని చిరంజీవికి అనిపించడం ముమ్మాటికీ సబబే. హీరోయిన్ల పక్కన డాన్సులు చేసే మసాలా వేషాల కన్నా ఇప్పుడివి చాలా అవసరం.

దర్శకుడు మోహన్ రాజా పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్టు కొన్ని కీలక మార్పులు చేశారు తప్పించి మూల కథను మాత్రం యథాతథంగా తీసుకున్నారు. ప్రారంభాన్ని అనవసరంగా సాగదీయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోయి బ్రహ్మ ఇంట్రోని చాలా పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిక్ చేయడం దగ్గరి నుంచే తన పనితనం చూపిస్తారు. పాత్రలను రిజిస్టర్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. అందుకే ఫస్ట్ హాఫ్ వీలైనంత ఎక్కువసేపు బోర్ కొట్టకుండా సాగుతుంది. తమన్ నేపధ్య సంగీతంలో కాస్త సౌండ్ ఎక్కువైనప్పటికీ అవసరమైన చోటల్లా ఎలివేషన్లను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి మాస్ కంటెంట్ కోసం వచ్చిన వాళ్ళను సంతృప్తి పరుస్తూ వెళ్ళింది.

నిజానికి లూసిఫర్ మూడు నాలుగు మలుపులున్న చిన్న పొలిటికల్ థ్రిల్లర్. కోడి రామకృష్ణ సినిమాల్లోలా హెవీ డ్రామా ఉండదు. సన్నివేశాల్లోని ఇంటెన్సిటీతో చూసేవాళ్ల మూడ్ ని ఒక టెంపోలో ఉంచేలా సాగుతుంది. మోహన్ రాజా ముప్పాతిక శాతం రిస్క్ తీసుకోకుండా తెలుగు జనాల సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవిని ఎలా ప్రెజెంట్ చేస్తే విజిల్స్ పడతాయనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనివల్ల కొన్నిచోట్ల సామాన్య ప్రేక్షకుడికి ఒక ఫ్యాన్ కి కలిగినంత వావ్ మూమెంట్ అనిపించదు. ఎమ్మెల్యేల సంతకం ఎపిసోడ్, సునీల్ కి జ్ఞానోదయం జరిగే సన్నివేశం లాంటివి ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

రాజకీయ నేపధ్యాలు రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అంత ఈజీగా కనెక్ట్ కావు. ఇందులోనూ ఆ సమస్య ఉంది. కామెడీకి స్కోప్ లేకపోవడంతో పూర్తిగా పక్కన పట్టేశారు. పొలిటికల్ గా సెటైర్లు వేయడానికి బోలెడు అవకాశం ఉన్నప్పటికీ మనోభావాలతో ఎందుకొచ్చిన తంటాలెమ్మని చాలా జాగ్రతగా డైలాగులు రాయించారు. అక్కడక్కడా కొన్ని చమక్కులు ఉన్నప్పటికీ ఇలాంటి సబ్జెక్టుకి ఆ డోస్ సరిపోదు. పదే పదే చెప్పుకునేలా పేరు చెప్పకుండా భలే కొట్టారే అనిపించాలి. చిరంజీవికి బయట ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వాటి మీద దృష్టి సారించలేదు. బలవంతంగా హీరోయిన్ ట్రాక్ ని ఇరికించకపోవడం గాడ్ ఫాదర్ లో ఉన్న అతి పెద్ద రిలీఫ్ ఫ్యాక్టర్.

తమిళంలో ఎన్ని రీమేకులను సూపర్ హిట్ చేసిన ట్రాక్ రికార్డు ఉన్న మోహన్ రాజా ఇది కూడా ఆ కోవలోకే చేర్చేందుకు గట్టి ప్రయత్నం చేశాడు. ఒరిజినల్ లో ఉన్న టోవినో థామస్ పాత్రని నీట్ గా తప్పించేశారు కానీ ఉంటేనే బాగుండేది. కింగ్ మేకర్ గా చెప్పుకున్న బ్రహ్మకు మరో ఎలివేషన్ దక్కేది. సినిమా మొత్తంలో నయనతారని పార్టీ ప్రెసిడెంట్ చేయడం, చివర్లో సిఎంని చేయడం తప్పించి అతని చాణక్య చతురత ఇంకా గొప్ప స్థాయిలో బయటపడే కీలక ఘట్టం తీసేయడం కొంత మైనస్సే. దాన్ని ఏ పవన్ తోనో కుదరదంటే ఏ గోపిచంద్ లాంటి వాళ్ళతోనో చేయించి ఉంటే బ్రహ్మ తాలూకు కమాండింగ్ అండ్ డిసైడింగ్ పవర్ కు మరింత బలం తోడయ్యేది.

ఇదంతా సరిగానే డీల్ చేసిన మోహన్ రాజా సల్మాన్ ఖాన్ ని వాడుకోవడంలో పూర్తిగా తడబడిపోయి క్లైమాక్స్ ని రసాభాస చేసేశారు. ఐటెం సాంగ్, దాని తర్వాత తార్ మార్ తక్కర్ మార్ పాట, చివర్లో ఇద్దరు కలిసి మెషీన్ గన్లతో డాన్ల మీద దాడి చేయడం ఇదంతా అభిమానులకు గూస్ బంప్స్ వ్యవహారమేమో కానీ విడిగా చూస్తే మాత్రం దీన్ని బాగా డిజైన్ చేసుకుని ఉండొచ్చుగా అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సల్లు భాయ్ ని సీరియస్ బాడీ గార్డ్ గా దింపి, చిరు లేదా నయన్ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కాపాడే వ్యక్తిగా లాంచ్ చేసి ఉంటే స్క్రీన్ బద్దలయ్యేది. మలయాళంలోనూ ఇలాగే ఉందని అనొచ్చు కానీ ఇక్కడ కంటే బెటరని చెప్పక తప్పదు.

గత డిజాస్టర్ ఆచార్య తాలూకు చేదుని పంటి కింద భరిస్తున్న ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ అత్యద్భుతంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. చిరంజీవి తమన్ మోహన్ రాజాలు చేసిన స్క్రీన్ ప్లే కనికట్టు అది. అలా అని అందరికీ అలాగే అనిపిస్తుందన్న గ్యారెంటీ ఎంతమేరకు ఫలిస్తుందో కలెక్షన్లు నిర్ణయిస్తాయి. ఈ మాత్రం కంటెంట్ తో మీడియం రేంజ్ స్టార్లే పేకాడొచ్చు. అలాంటిది మెగాస్టార్ కి దొరికితే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా. లూసిఫర్ తో పోల్చినా పోల్చకపోయినా గాడ్ ఫాదర్ నిస్సందేహంగా చిరంజీవి ఎవరెస్ట్ హీరోయిజంని కొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సినిమాగా మిగిలిపోతుంది. ఎలివేషన్ల జమానా నడుస్తోంది కాబట్టి విజేతగా నిలిచినా ఆశ్చర్యం లేదు

సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫుల్ డ్యూటీ చేశాడు. రెండు పాటలు బెస్ట్ ఇవ్వగా బిజిఎంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన మాట వాస్తవం. రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లే కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని కొత్త స్థాయికి తీసుకెళ్లే అవుట్ ఫుట్ తో మరోసారి మెప్పించాడు. ఛాయాగ్రాహకులు నీరవ్ షా అనుభవం చిరంజీవి కసికలిగిన కళ్ళలో, నిండైన ఫ్రేమ్స్ లో తనివితీరా ఆస్వాదించవచ్చు. లక్ష్మి భూపాల సంభాషణలు సరైన చోట సరిగ్గా పేలాయి. అధికార ప్రతిపక్షాలకు కొన్ని చమక్కులు ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ పోరాటాలు బాగున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వీలైనంత ల్యాగ్ లేకుండా చూసుకుంది. సూపర్ గుడ్ నిర్మాణ విలువలు సూపరే

ప్లస్ గా అనిపించేవి

చిరంజీవి
యాక్షన్ ఎపిసోడ్లు
తమన్ బిజిఎం

మైనస్ గా తోచేవి

కొంత సెకండ్ హాఫ్ ల్యాగ్
క్లైమాక్స్ హడావిడి
చివరి పాటలో డాన్స్

కంక్లూజన్

ఒకప్పుడు చిరంజీవి సినిమా బాగుందా లేదానే ప్రశ్న ఉండేది కాదు. మెగాస్టార్ బొమ్మనే అర్హత చాలు టికెట్లు తెగడానికి. కానీ మారిన పరిస్థితులు, కొత్త తరం ఆలోచనలు వగైరాలు అంతపెద్ద నటశిఖరాన్ని కూడా మూసవైపు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాయి. దానికి మొదటి సమాధానంగా ఈ గాడ్ ఫాదర్ ని చెప్పుకోవచ్చు. స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్లతో యూత్ విపరీతంగా కనెక్ట్ అవుతున్న ట్రెండ్ లో ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్లు సక్సెస్ కావడం సులభమే. ఆయన కెరీర్ బెస్ట్ లేదా టాప్ 5లో ఉంచేంత సీన్ ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టం కానీ ఇండస్ట్రీకి కంబ్యాక్ అయ్యాక చేసిన డీసెంట్ మూవీగా దీనికి మంచి స్థానాన్ని ఇవ్వొచ్చు. అది ఏ ర్యాంకనేది నిర్ణయించేది ఆడియన్సే

ఒక్కమాటలో – మాస్ ఫాదర్

రేటింగ్ : 2.75/5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి