iDreamPost

అనుకోని అవాంతరాలతో స్నేహితుల ప్రయాణం

అనుకోని అవాంతరాలతో స్నేహితుల ప్రయాణం

ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే మల్టీస్టారర్ అంటాం. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి చేస్తే దానికో కొత్త పేరు పెట్టాలేమో. నిన్నటి తరంలో హాస్య చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకుని కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకరు. సింహబలుడు, సింహగర్జన లాంటి ఎన్టీఆర్ కృష్ణ సినిమాల మధ్య తన జగన్మోహినిని విడుదల చేసి అద్భుత విజయం సాధించి ఎన్నో ఫాంటసీ చిత్రాలకు చిరునామాగా మారిన నరసింహరాజు మరొకరు. ఈ దిగ్గజాల కలయికలో వస్తున్న చిత్రమే అనుకోని ప్రయాణం. ఏదో నవ్వించడం కోసం కాకుండా ఒక సీరియస్ పాయింట్ ని తీసుకుని భావోద్వేగాలను మేళవించి చేసిన ప్రయత్నమిది.

ఎక్కడో వేరే రాష్ట్రంలో ఊరు కాని ఊరు మన భాషే లేని చోట భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తుంటారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. కరోనా వచ్చి దేశం మొత్తం మూతబడినప్పుడు వీళ్ళ ఉపాధికీ గండం వచ్చి పడుతుంది. పనులు పోతాయి. అదే సమయంలో వీళ్ళలో ఒకరు (నరసింహరాజు) అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతాడు. ఎలాగైనా సరే మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకుంటాడు బ్రతికున్న మిత్రుడు(రాజేంద్రప్రసాద్). దారి పొడవునా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. దెబ్బలు తగులుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఆ తర్వాత జరిగేదే తెరమీద చూడాల్సిన ఎమోషనల్ జర్నీ.

సహజమైన వాతావరణంలో ఎలాంటి కృత్రిమ కమర్షియల్ అంశాలకు చోటివ్వకుండా స్నేహితుల మధ్య ఉన్న బంధాన్ని కొత్త దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టే రాజేంద్రప్రసాద్, నరసింహరాజులు ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడంతో కొత్త అనుభూతి కలుగుతుంది. దీనికి సుప్రసిద్ధ రచయితలు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించగా శివ దినవాహి సంగీతం సమకూర్చారు. ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శీను, ధన్ రాజ్, జోగి బ్రదర్స్, రంగస్థలం మహేష్ లాంటి ఎందరో సీనియర్ క్యాస్టింగ్ భాగమయ్యారు. ఈ నెల 28న థియేటర్లలో ఈ అనుకోని ప్రయాణం ప్రేక్షకులను పలకరించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి