England: World Cup 2023: వరల్డ్‌ కప్‌ ముందు చేసిన తప్పులే ఇంగ్లండ్‌ ఓటములకు కారణమా?

World Cup 2023: వరల్డ్‌ కప్‌ ముందు చేసిన తప్పులే ఇంగ్లండ్‌ ఓటములకు కారణమా?

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా వరల్డ్‌ కప్‌ వేటలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ప్రస్తుతం ఓ పసికూన జట్టును తలపిస్తూ ఆడుతోంది. అయితే.. వారి ఈ చెత్త ప్రదర్శనకు వాళ్లు చేతలారా చేసిన కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా వరల్డ్‌ కప్‌ వేటలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ప్రస్తుతం ఓ పసికూన జట్టును తలపిస్తూ ఆడుతోంది. అయితే.. వారి ఈ చెత్త ప్రదర్శనకు వాళ్లు చేతలారా చేసిన కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల బట్టి చూస్తే.. సెమీస్‌ చేరే జట్లపై కాస్త క్లారిటీ వస్తోంది. ఓ మూడు జట్లకు మాత్రం సెమీస్‌ చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మూడు ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌. ఇక నాలుగో స్థానం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ పోటీ పడుతున్నాయి. కానీ, ఓ పెద్ద టీమ్‌ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయింది. అ టీమ్‌ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగి.. చెత్త ప్రదర్శనతో అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఇంగ్లండ్‌ జట్టు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌పై భారీ అంచానలు ఉన్నాయి.

జట్టు నిండా స్టార్లు, ఏ టీమ్‌లో లేనంత మంది ఆల్‌రౌండర్లు, హార్డ్‌ హిట్టర్లు, పైగా వాళ్లే డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌. దీంతో ఈ సారి వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ను అంతా హాట్‌ ఫేవరేట్లుగా భావించారు. కానీ, ఇంగ్లండ్‌ అందర్ని నిరాశపరుస్తూ.. చెత్త ఆటతో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్లో ఉంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. పసికూన నెదర్లాండ్స్‌ కంటే ఆధ్వానంగా ఆడుతోంది. వారి కంటే బెటర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.

ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక​ చేతుల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రానున్న మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి ఎరుగని టీమ్‌, భీకర ఫామ్‌లో టీమిండియాను ఢీకొట్టనుంది ఇంగ్లండ్‌. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుస్తుందన్న నమ్మకం ఎవరీ లేదు. ఇలా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగి.. సగం టోర్నీ పూర్తి అయ్యే సరికి ఓ చెత్త టీమ్‌గా ఇంగ్లండ్‌ మారిపోయిందనే ప్రశ్న ఇప్పుడు సగటు క్రికెట్‌ అభిమానని వేధిస్తోంది. అయితే.. ఇంగ్లండ్‌ జట్టు వరల్డ్‌ కప్‌ టోర్నీ కంటే ముందు చేసిన చాలా తప్పులు ఇప్పుడు వారి దారుణ పరిస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..

ఇంగ్లండ్‌ వేదికగా ‘ది హండ్రెడ్‌’ అనే లీగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ టోర్నీని ఆగస్టులో నిర్వహించారు. వన్డే వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ది హండ్రెడ్‌ లాంటి టీ20 కంటే చిన్న ఫార్మాట్‌లో పెద్ద టోర్నీ నిర్వహించడం ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బతీసింది. 100 బంతుల ఇన్నింగ్స్‌గా జరిగే ఆ టోర్నీలో ఇంగ్లండ్‌ జట్టులోని ఆటగాళ్లంతా పాల్గొని ఫాస్టెస్ట్‌ క్రికెట్‌కు బాగా అలవాటు పడిపోయారు. అప్పటికే బజ్‌బాల్‌ క్రికెట్‌ అంటూ టెస్టుల్లో వేగంగా ఆడటం అలవాటు చేస్తున్న ఇంగ్లండ్‌.. టీ20ల కంటే షార్టెస్ట్‌ ఫార్మాట్‌ అయిన ది హండ్రెడ్‌కు మరింత అలవాటు పడ్డారు. దీంతో కేవలం ఒక్క నెల గ్యాప్‌లో వన్డేలకు అలవాటు పడలేకపోతున్నారు. అసలు వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు ది హండ్రెస్‌ టోర్నీ పెట్టడం అర్థం లేని పని.

అసలే ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు వన్డేలు ఆడటం పెద్దగా ఇష్టలేనట్టు ఉంది. బెన్‌ స్టోక్స్‌ లాంటి ఆటగాడు వన్డేలకు రిటైర్మెంట్‌ ఇచ్చి, టీ20లు, టెస్టులు ఆడుకుంటానని చెప్పడం అందుకు ఉదాహరణ. కానీ, అతన్ని వన్డే వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ టీమ్‌లోకి తీసుకోచ్చారు. ఆడితే టీ20లు, లేదా టెస్టుల్లో వేగంగా ఆడటం ఇదే వారికి అలవాటుగా మారిపోయింది. కానీ, వన్డేలు అలాగే కాదు.. ఇక్కడ అసలు సిసలైన క్రికెట్‌ స్ట్రాటజీతో ఆడాలి. వేగంగానూ ఆడాలి, అలాగే ఒపికతో కూడా ఉండాలి. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తొక్కాలో తెలిసుండాలి. అప్పుడే వన్డేల్లో రాణించే అవకాశం ఉంటుంది. లేదు వేగంగానే ఆడతాం, నిదానంగా ఆడతాం అంటే కుదరదు. వేగం, ఒపిక, స్ట్రాటజీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాలి.

దిహండ్రెడ్‌ లీగ్‌తో పాటు జెసన్‌ రాయ్‌ లాంటి మంచి వన్డే ప్లేయర్‌ను వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకోకపోవడం ఇంగ్లండ్‌ చేసిన మరో పెద్ద మిస్టేక్‌. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా మంచి ప్లేయర్లే అయినా.. రాయ్‌ ఉంటే ఇంగ్లండ్‌కు వన్డే టీమ్‌ లుక్‌ వచ్చేంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ నిఖార్సయిన టీ20ల టీమ్‌లా ఉంది కానీ, వన్డే జట్టులో ఉండాల్సిన లక్షణాలు ఆ టీమ్‌లో కనిపించడం లేదు. ఇక కెప్టెన్సీ గురించి మాట్లాడితే.. జట్టుపై జోస్‌ బట్లర్‌కు పెద్దగా ఆధిపత్యం ఉన్నట్లు కనిపించడం లేదు. ఆటగాళ్లపై కెప్టెన్‌కి పట్టు ఉండాలి. కానీ, ఇంగ్లండ్‌లో ఆ పరిస్థితులు లేవు. ఆటగాళ్లంతా స్టార్లు కావడం, దాదాపు బట్లర్‌ కంటే ముందే జట్టులో సుస్థిరంగా ఉండటంతో కెప్టెన్‌గా బట్లర్‌ తన ఆలోచనలు కానీ, తన మాట కానీ నెగ్గించుకున్నట్లు కనిపించడం లేదు.

ఇక జట్టులో ఆటగాళ్ల ఎంపిక విషయంలో.. హ్యరీ బ్రూక్‌ లాంటి ప్లేయర్‌కు అవకాశాలు ఇస్తున్నారని, కానీ, జట్టు పరిస్థితులకు తగ్గట్లు అతన్ని మోటివేట్‌ చేస్తూ ఆడించే సీనియర్‌ ప్లేయర్‌ కనిపించడం లేదు. ఏ వరల్డ్‌ కప్‌ జట్టులోనైనా బౌలింగ్‌ విభాగం ఎంతో కీలకం. యువ బౌలర్లు ఎంత అద్భుతంగా రాణిస్తున్నా.. వారికి తోడుగా అనుభవం ఉన్న ఒక సీనియర్‌ బౌలర్‌ జట్టుకు ఎంతో అవసరం. ప్రస్తుతం ఇంగ్లండ్‌ టీమ్‌లో అద్భుతమైన బౌలర్లు ఉన్నా.. వారిని లీడ్‌ చేసే ఒక సీనియర్‌ బౌలర్‌ లేడు. వుడ్‌, సామ్‌ కరన్‌ అంతా మంచి బౌలర్లే కానీ, ఒక ఇక్స్‌పీరియన్స్‌ ఉన్న మెయిన్‌ బౌలర్‌ లేడు. అతనుంటే.. జట్టు బౌలింగ్‌ను ముందుండి నడిపిస్తూ.. సరైన సమయంలో మంచి సూచనలు చేస్తూ బౌలింగ్‌ను మ్యానేజ్‌ చేస్తాడు. ఒక యువ బౌలర్‌ 10 ఓవర్ల కోటా పూర్తి చేయడం అంటే మాటలు కాదు. టీమిండియాకు 1983లో ఒక కపిల్‌ దేవ్‌, 2003లో జవగళ్‌ శ్రీనాథ్‌, 2011లో ఒక జహీర్‌, ఇప్పుడు ఒక బుమ్రా టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ను లీడ్‌ చేస్తూ మంచి ఫలితాలు సాధించారు. ఇలా అనేక తప్పిదాలు చేస్తున్న ఇంగ్లండ్‌ జట్టు వరల్డ్‌ కప్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మరి ఇంగ్లండ్‌ చెత్త ప్రదర్శనపై, అలాగే పై పేర్కొన్న కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments