78 ఏళ్ల వయసులో 9వ తరగతి.. 3 కి.మీ నడిచి మరీ స్కూలుకు!

78 ఏళ్ల వయసులో 9వ తరగతి.. 3 కి.మీ నడిచి మరీ స్కూలుకు!

సాధించాలన్న పట్టుదల ఉండాలి కానీ.. మనిషి అనుకుంటే కానిది అంటూ ఏదీ ఉండదు. కొన్ని సార్లు ఆలస్యం కావచ్చేమో కానీ.. అనుకున్నది మాత్రం జరిగి తీరుతుంది. మిజోరాంకు చెందిన ఓ తాతను చూస్తే.. ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన చదువుకోలేకపోయాడు. కానీ, చదవాలన్న కోరిక ఆయనకు బాగా ఉండేది. 78 ఏళ్లు వచ్చినా ఆ కోరిక చావలేదు. దీంతో లేటు వయసులో చదవటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మిజోరాం రాష్ట్రంలోని చంపాయ్‌ జిల్లాకు చెందిన లల్‌రింగతార చిన్నతనంలో తండ్రిని కోల్పోయాడు. ఇంటికి పెద్ద కొడుకు కావటంతో తల్లితో పాటు కుటుంబ బాధ్యత ఇతడిపై కూడా పడింది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసి తల్లితో కలిసి పొలం పనులకు వెళ్లేవాడు. కొన్నేళ్లకు వీరు వేరే ఊరికి మారారు. అక్కడ లల్‌రింగతార ఐదవ తరగతిలో చేరాడు. అక్కడ కూడా అతడికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబం కారణంగా మళ్లీ చదువును ఆపేశాడు. వయసు పెరిగే కొద్ది అతడిలో చదువుకోవాలన్న కోరిక మరింత బలపడింది.

78 ఏళ్ల వయసులో పోయిన సంవత్సరం మళ్లీ స్కూలులో చేరాడు. లల్‌రింగతార ఆసక్తితో స్కూలు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అతడికి యూనీఫామ్‌, పుస్తకాలు, బ్యాగు అందజేశారు. ప్రస్తుతం ఆయన 9వ తరగతి చదువుతున్నాడు. ఊర్లో స్కూలు లేకపోవటంతో దాదాపు 3 కిలోమీటర్లు నడిచి పక్క ఊర్లో ఉన్న స్కూలుకు వెళుతున్నాడు. ఇక, దీనిపై లల్‌రింగతార మాట్లాడుతూ…‘‘జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి వయసు నాకు అడ్డుకాలేదు. నేను ప్రతీ అప్లికేషన్‌ను ఇంగ్లీష్‌లో రాయాలి. ఇంగ్లీష్‌లో వచ్చే వార్తల్ని కూడా నేను అర్థం చేసుకోగలగాలి’’ అని అన్నాడు. మరి, లేటు వయసులో ఈ తాత 9వ తరగతి చదవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments