iDreamPost

ఈ వాచ్‌కు హైకోర్టులో బ్రేక్‌..!

ఈ వాచ్‌కు హైకోర్టులో బ్రేక్‌..!

పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెచ్చిన ఈ వాచ్‌ యాప్‌కు ఏపీ హైకోర్టులో బ్రేక్‌ పడింది. ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన యాప్‌లు అందుబాటులో ఉన్నా.. వాటిని పట్టించుకోని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రైవేటుగా ఈ వాచ్‌ అనే పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. బుధవారం దీన్ని ఆవిష్కరించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వంతోపాటు ఇతరులు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఈ వాచ్‌ యాప్‌పై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎవరు తయారు చేశారు..? ఎవరు ఆపరేట్‌ చేస్తారు..? డేటా ఎక్కడ స్టోర్‌ చేస్తారు..? భద్రతాపరమైన సర్టిఫికెట్‌ ఉందా..? వంటి ప్రశ్నలను ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై సరైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదులు, భదత్రాపరమైన సర్టిఫికెట్‌ మరో ఐదు రోజుల్లో వస్తుందని తెలిపారు. అప్పటి వరకు ఈ యాప్‌ను వాడొద్దని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

పంచాయతీ ఎన్నికలు తన సొంత వ్యవహారమనేలా వ్యవహరిస్తున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. సొంతంగా యాప్‌ను తెస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని ఉచితంగా తయారు చేయించినట్లు చెప్పడం అనేక అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా యాప్, కేంద్ర ఎన్నికల సంఘం వినియోగించే సివిజిల్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నా.. వాటిని పట్టించుకోని నిమ్మగడ్డ ఈ వాచ్‌ యాప్‌ను తేవడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికీ దానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్లడి కాలేదు. ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదులు స్వీకరిస్తారని, వాటిని తాము పరిశీలిస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పడంతో అధికార యంత్రాంగ విస్మయం వ్యక్తం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి భద్రతాపరమైన ధ్రువపత్రం లేకుండా యాప్‌ను నిమ్మగడ్డ ఆవిష్కరించారు. ఈ విషయాన్నే ఏపీ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది.

ఈ నెల 9వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. ఆ రోజు ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్, ఉప సర్పంచ్‌ ఎన్నిక జరుగుతుంది. ఈ వాచ్‌ యాప్‌పై తదుపరి విచారణ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడంతో తొలి దశ ఎన్నికల నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. పరిశీలన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను అధికారులు గురువారం ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్‌ రోజున తలెత్తే అవాంఛనీయ, నిబంధనలకు విరుద్ధమైన ఘటనలపై ప్రజలు ఎవరికి..? ఎలా..? ఫిర్యాదు చేయాలనే అంశంపై ఏపీ ఎస్‌ఈసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Read Also : ఈ–వాచ్‌.. ప్రభుత్వంతో పని లేదా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి