iDreamPost

పాత సినిమాలకు కొత్త రోజులొచ్చాయి

పాత సినిమాలకు కొత్త రోజులొచ్చాయి

ఒకప్పుడు థియేటర్లలో పాత సినిమాలను ఆడించడం సాధారణం. సెకండ్ థర్డ్ రిలీజ్ అంటూ బ్లాక్ బస్టర్లు చాలాసార్లు ప్రేక్షకులను పలకరించేవి. వసూళ్లు కూడా ఘనంగా వచ్చేవి. అప్పుడు ఇంటర్ నెట్లు యుట్యూబ్ లు లేవు కాబట్టి అలా నడిచింది. కానీ టెక్నాలజీ దెబ్బకు ఇదంతా గత వైభవంగా మారిపోయింది. కొత్త సినిమాలే పట్టుమని వారం పదిరోజులు గట్టిగా ఆడితే అదృష్టమనుకునే పరిస్థితులు వచ్చాయి. టాక్ బాగుంటే రెండు మూడు వారాలు. తేడా కొట్టిందో ఎల్లుండికే దుకాణం బంద్. ఓ పదిహేను ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటిలో ప్రత్యక్షం ఆపై శాటిలైట్ ఛానల్ లో దర్శనం. అక్కడితో సినిమా లైఫ్ అయిపోయింది. డిజిటల్ లో చూసుకోవడమే.

ఇప్పుడు అభిమానుల పుణ్యమాని మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి. ఈ నెల 23న మహేష్ బాబు దూకుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో రాత్రి స్పెషల్ షో ఏర్పాటు చేసుకున్నారు ఫాన్స్. టికెట్లు అయిపోవడంతో నగరంలో మరో చోట కూడా సెట్ చేశారు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా పదికి పైగా మెయిన్ సెంటర్స్ లో ఇలా షోలు వేసి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇదే నెల 25న చెన్నకేశవరెడ్డి 19 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా దీనికీ షోలు వేయబోతున్నారు. థియేటర్ ఖరారు కాగానే అదీ ప్రకటిస్తారు.

అరచేతిలో స్మార్ట్ ఫోన్ లో చిన్న క్లిక్ తో ఈజీగా ఇలాంటి సినిమాలు చూసుకునే అవకాశం ఉన్నా పెద్ద తెరపై చూస్తే వచ్చే అనుభూతితో అది సాటిరాదు కాబట్టే ఈరకంగా ఫాన్స్ తమ ముచ్చటను తీర్చుకుంటున్నారు. గతంలో గబ్బర్ సింగ్, మగధీర, ఆది, టెంపర్, జగడం లాంటి చిత్రాలు ఇలాగే మంచి వసూళ్లు తెచ్చాయి. ఎక్కడ వేసినా ఆ ఒక్క షో మాత్రం టికెట్లన్నీ అమ్ముడుపోయి హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల వరస చూస్తుంటే ఇలా పాతవి వేసుకుని అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడమే మంచిదంటున్నారు ప్రేక్షకులు. రాబోయే రోజుల్లో ఇలా ప్రతి హిట్ సినిమాకూ ప్రీమియర్లు పడి ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు

Also Read : చైతు సినిమాకు వసూళ్ల ఛాలెంజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి