iDreamPost

ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు కూడా రాని బాబు ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నట్లు ?

ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు కూడా రాని బాబు ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నట్లు ?

ఏ ఘర్షణలోనైనా దాడి చేసిన వారిదే తప్పు .ఆ ఘర్షణను ప్రేరేపించిన కారణాలు అనేకం ఉండవచ్చు . కానీ దాడి చట్టవ్యతిరేకమే, సమాజ కోణంలో హర్షణీయం కాదు . మూడు రోజుల కిందట మాచర్లలో టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తప్పు , పార్టీలకు అతీతంగా పౌర సమాజం ఖండించాల్సిన విషయం.

ఘటన జరిగిన మరునిమిషం నుంచి నేతలకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన తీరు, బాసటగా నిలిచిన వైనాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ఇదే చంద్రబాబు వ్యవహారతీరుకు సంబంధించిన కొన్ని గత అంశాలను చర్చించాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ద్వంధ్వ వైఖరి పల్నాడు ఏరియాలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు..
టీడీపీ అభ్యర్థిగా అమెరికాలో చిన్న వ్యాపారం చేసుకుంటున్న గోపవరపు మల్లికార్జున్‌ సతీమణి శ్రీదేవిని 2014 మాచర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలోకి దింపారు. మల్లికార్జున్‌ తండ్రి బ్రహ్మయ్యకు స్థానికంగా ఉన్న పేరు, సామాజికవర్గ బలంతో టీడీపీ చైర్మన్‌ పీఠం దక్కించుకుంది. ఎన్నికల ఖర్చు మొత్తం మల్లికార్జున్‌ పైనే పెట్టారు. శ్రీదేవి చైర్‌ పర్సన్‌ అయ్యారు.

రెండున్నరేళ్ల తర్వాత శ్రీదేవికి టీడీపీ నేతలు ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు. రాజీనామా చేయాలని, మిగతా రెండున్నరేళ్లు మరొకరికి చైర్‌పర్సన్‌ స్థానం ఇవ్వాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు.

ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టడం, తెచ్చిన అప్పులకు ధర్మవడ్డీ కొండంతలా పెరిగిపోవడంతో పాటు సొంత పార్టీలోనే నిత్యం అసమ్మతి ఎదుర్కొవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన శ్రీదేవి భర్త మల్లికార్జున్‌ 38 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేదుకు గానీ, శ్రీదేవిని పరామర్శించేందుకు గానీ టీడీపీ అధినేత చంద్రబాబు కాదు కదా కనీసం జిల్లా నేతలు కూడా రాలేదు.

భర్త మరణించాడన్న సానుభూతి కూడా లేకుండా శ్రీదేవిని రెండున్నరేళ్లకే పట్టుబట్టి పదవి నుంచి దించారు. భర్త మరణం, మోసపోయామనే భావన, అగమ్యగోచరమైన భవిష్యత్‌.. అన్ని కలిపి 35 ఏళ్ల శ్రీదేవిని ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పాయి. ఎక్కడో అమెరికాలో తమ బతుకు తాము బతుకుతున్నవారిని, రాజకీయం బొత్తిగా తెలియని మల్లికార్జున్‌–శ్రీదేవి దంపతుల మరణానికి కారణం ఎవరు..? వారి 10 ఏళ్ల ఏకైక కుమారుడు తల్లిదండ్రులు లేని బిడ్డ కావడానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?

మల్లికార్జున్‌ చనిపోయిన సమయంలోనూ, శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలోనూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించలేదు.లోకేష్ తో సహా ఏ మంత్రికి వారిని ఓదార్చటానికి సమయం దొరకలేదు. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటిలాగా కృష్టా జిల్లా నుంచి నేతలనూ పంపలేదు. కనీసం గుంటూరు జిల్లా నేతలు కానీ , పల్నాడు నాయకులు కానీ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు.


చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..

2019 ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా పల్నాడులోని ఆత్మకూర్‌ అనే గ్రామంలో వైసీపీ వారు.. టీడీపీ వారిని ఊరి నుంచి వెళ్లగొట్టి వారి ఆస్తులు లాక్కున్నారంటూ చెప్పిన చంద్రబాబు, పౌర హక్కుల కోసమంటూ.. ఛలో ఆత్మకూర్‌ అనే నినాదం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత గ్రామాల్లో ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ గొడవలు సద్దుమణుగుతాయి. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. దాదాపు 17 మంది వైసీపీ వర్గీయులు హత్యకు గురయ్యారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.

ఆ దాడులను, హత్యలను తేలిగ్గా కొట్టిపారేసిన చంద్రబాబు.. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే స్వయంగా తానే రంగంలోకి దిగుతారు. మీడియా ముందుకు వచ్చి అరిచి గోల పెడతారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు తానే వెళతానంటాడు.

నిన్న మొన్న మాచర్లలో తమ పార్టీ వారిని నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని చంద్రబాబు ఏకంగా కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను పంపారు. అక్కడ వారిపై దాడి జరిగింది. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయడానికి అడ్డుకుంటున్నారనే… ఏకంగా చంద్రబాబు సీన్‌లోకి వచ్చారు.

ఆత్మకూర్‌లో పార్టీ కార్యకర్తలకు, మాచర్లలో పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు అండగా ఉండేదుకు అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరించిన తీరు నిజంగా ప్రశంసనీయమే. ఇదే సమయంలో తాను సీఎంగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతల వేధింపులు, అవమానాలు, ఒత్తిళ్లతో ఏకంగా మాచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి భర్త చనిపోయినా.. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్నా.. ఆ కుటుంబానికి ఎందుకు అండగా ఉండలేదని చంద్రబాబును మాచర్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయి కార్యకర్త విషయంలోనూ స్పందించే చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధికి అన్యాయం జరిగినా పల్లెత్తు మాట కూడా మాట్లాడరనేదానికి పైన పేర్కొన్న మూడు సంఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి