తెలుగువారి హాస్య బ్రహ్మ,బ్రహ్మానందం రాజకీయాల్లోకి రానున్నారా? బీజేపీ తరపున రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా? అన్న సందేహాలు రెండు తెలుగురాష్ట్రాల ప్రజల్లో ఏర్పడ్డాయి. దీనికి కారణం కర్ణాటకలో జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడాన్ని చూస్తుంటే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలుగు సినీనటులు రాజకీయాల్లోకి రావడం,పార్టీపై అభిమానంతో రాజకీయ పార్టీల తరపున ప్రచారం చేయడం మాములే. కానీ బ్రహ్మానందం వేరే రాష్ట్రంలో జరగబోతున్న ఉపఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే,ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున శనివారం బ్రహ్మానందం రోడ్‌షో నిర్వహించారు. కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర, బాగేపల్లి, గౌరిబిదనూరు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. తెలుగు సినీనటులు ప్రభావం కూడా అక్కడి ప్రాంతాలవారిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రహ్మానందం బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరుపున ప్రచారం చేసినట్లు తెలుస్తుంది. దీనితో బ్రహ్మానందం బీజేపీ లో చేరనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
కాగా కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్ష సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ తిరిగి ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు. దీనిపై అనర్హత వేటుకు గురైన 17 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పీకర్ అనర్హత వేటు నిర్ణయం సరైనదేనని సమర్థిస్తూ, తిరిగి ఉపఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోటీ చేసుకోవచ్చని తీర్పును ఇచ్చింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 5 న జరగబోయే ఉపఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయనున్నారు. అలా అనర్హత వేటు పడి తిరిగి ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో డాక్టర్ సుధాకర్ ఒకరు.
2018 ఎన్నికల్లో ఇదే చిక్కబళ్లాపుర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కిరణ్ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రచారం చెయ్యటం చేశారు.ఆ ఎన్నికల్లో నవీన్ కిరణ్ 19 శాతం ఓట్లతో 30 వేల ఓట్లు సాధించి మూడవస్థానంలో నిలిచాడు.
గత అక్టోబర్ లో మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో షోలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మహేశ్ కోథే తరుపున బ్రహ్మానందం ప్రచారం చేశారు.
చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో బ్రహ్మానందం PRP తరుపున తణుకు నుంచి ఎన్నిల బరిలో నిలుస్తారని ప్రహకారం జరిగింది కానీ ఆయన ప్రచారానికి ,ఎన్నికలకు దూరంగా ఉండిపోయాడు. ఇప్పుడు సినిమా అవకాశాలు నెమ్మదించటంతో రాజకీయాలను సీరియస్ గా పరిగణిస్తారా?ఈ మధ్య జరిగిన ఒక సభలో బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు.బ్రహ్మానందం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారా? లేక ఇలా నచ్చిన అభ్యర్థుల ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారో చూడాలి.