iDreamPost

అంచనాలు పెంచేసిన గబ్బర్ సింగ్ కాంబో

అంచనాలు పెంచేసిన గబ్బర్ సింగ్ కాంబో

పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక పోస్టర్ ని విడుదల చేశారు. పవన్ టెర్రిఫిక్ లుక్ ని బులెట్ మీద కూర్చున్నట్టు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయగా ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే అంచనాలు పెంచే స్థాయిలో దీన్ని డిజైన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సోషల్ మెసేజ్ ఎంటర్ టైనర్ లో గబ్బర్ సింగ్ తరహా వినోదంతో పాటు ఆలోచింపజేసే సందేహం కూడా ఉంటుందని హరీష్ శంకర్ రెగ్యులర్ గా క్లూలు ఇస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే ఇప్పుడీ లుక్ ఉంది.

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కి నిజానికి ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ దక్కలేదు. రామయ్య వస్తావయ్యా డిజాస్టర్ కాగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సాయి ధరమ్ తేజ్ కి మంచి హిట్ గా నిలిచింది. డీజే దువ్వాడ జగన్నాథం కమర్షియల్ గా సేఫ్ అయ్యిందే తప్ప మరీ ఆశించిన ఫలితం అయితే కాదు. రెండేళ్ల గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ హిట్టే కానీ మరీ రికార్డులు తిరగరాసేంత కాదు. అందుకే ఇప్పుడు వచ్చిన ఈ పవర్ ఫుల్ అవకాశాన్ని వాడుకుని భవదీయుడు భగత్ సింగ్ తో మళ్ళీ తన ట్రాక్ రికార్డును నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేయబోతున్నట్టు కనిపిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది ఇంకా తెలియాల్సి ఉంది

ఇక పవన్ విషయానికి వస్తే భీమ్లా నాయక్ పూర్తి చేసిన వెంటనే హరిహరవీరమల్లుని కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో సమాంతరంగా భగత్ సింగ్ ని చేస్తారా లేక అదయ్యాక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇవి కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న మరో ప్రాజెక్టు కూడా ఉంది. ఎంత వేగంగా చేసినా ఈ నాలుగు సినిమాలకే ఏడాదిన్నర పైగా గడిచిపోయేలా ఉంది. ఇంకో రెండు మూడు కొత్త కమిట్ మెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. బండ్ల గణేష్ కూడా తన దేవర గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. విడుదల క్రమంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నా ఆశ్చర్యం లేదు.

Also Read: సూపర్ స్టార్ కోసం ఖల్ నాయక్ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి