నిమ్మగడ్డకు గడ్డు రోజులు.. చర్యలు దిశగా శాసన వ్యవస్థ అడుగులు..

నిమ్మగడ్డకు గడ్డు రోజులు.. చర్యలు దిశగా శాసన వ్యవస్థ అడుగులు..

పెరుగుట విరుగుట కొరకే అనే మాట బహుశా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లాంటి వారి వ్యవహారశైలి వల్లే ఉద్భవించి ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. పరిధి దాటి వ్యవహరించిన వారు కింద పడక తప్పదు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తనకు అధికారం ఉందా..? లేదా..? అనే ఆలోచన చేయకుండానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై కాలు దువ్వుతున్నారు. అగౌరవ పరిచే చర్యలకు పూనుకున్నారు. ఈ తరహా ప్రవర్తనతోనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన ఉచ్చును తానే బిగుసుకుంటున్నారు.

అధికారులపై చర్యలు, బదిలీ వేటుల వరకు ఉంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ శాసన వ్యవస్థతో వివాదం పెట్టుకున్నారు. పంచాయతీ రాజ్, పురపాలక శాఖల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారయణలను కించపరిచేలా గవర్నర్‌కు లేఖ రాయడం నిమ్మగడ్డ చేసిన పెద్ద తప్పిదం. ఆ తర్వాత కూడా పంచాయతీ రాజ్‌ మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రానీయొద్దంటూ, మీడియాతో మాట్లాడనీయోద్దంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసి వివాదాన్ని మరింత పెద్దది చేసుకున్నారు. నిమ్మగడ్డ నిర్ణయాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది. పంచాయతీ రాజ్‌ మంత్రిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంచాలన్న ఆదేశాలను కొట్టివేసింది.

మంత్రులపై ఫిర్యాదులు చేస్తూ, వారిని అగౌవర పరిచేలా, హక్కులకు భంగం కలిగేలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు లేఖ రాయడం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. మంత్రులు .. సభాహక్కుల ఉల్లంఘన కింద అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి చైర్మన్‌గా గల ప్రివిలేజ్‌ కమిటీ దాన్ని విచారణకు స్వీకరించింది. ఇరు వైపుల వాదనలు కూడా వినేందుకు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాంలు నిన్న సోమవారం గవర్నర్‌ను కలిశారు. దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. నిమ్మగడ్డపై మంత్రులు చేసిన ఫిర్యాదు, అంతకు ముందు జరిగిన పరిణామాలు, జరగబోయే పరిణామాలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ లోపు ప్రివిలేజ్‌ కమిటీ మంత్రుల ఫిర్యాదుపై విచారణను పూర్తి నివేదికను స్పీకర్‌కు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలోనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై స్పీకర్‌ నిబంధనల ప్రకారం చర్యలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 31వ తేదీతో నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తోంది. పదవిలో లేనప్పుడైనా నిమ్మగడ్డపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఏది ఏమైనా మండల, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికలు ముగిసిన వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనబోతున్నారనే సంకేతాలైతే స్పష్టంగా వెలువడుతున్నాయి.

Show comments