iDreamPost

పీఆర్‌సీ జీవోలకు ఆమోదం.. ఉద్యోగులకు వివరించేందుకు కమిటీ

పీఆర్‌సీ జీవోలకు ఆమోదం.. ఉద్యోగులకు వివరించేందుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. నూతన పీఆర్‌సీ జీవోలను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇతర అంశాలతోపాటు పీఆర్‌సీపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. పీఆర్‌సీ జీవోలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి, వారికి వివరించేందుకు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

పీఆర్‌సీ అమలుపై జారీ చేసిన జీవోలను ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.. ఉద్యోగులకు ఇచ్చిన ఇతర హామీలకు కూడా ఆమోద్ర ముద్ర వేసింది. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల ఇళ్ల పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌ ఇవ్వాలని, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది.

పీఆర్‌సీ జీవోలను వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు, తమ ఆందోళనలను కొనసాగించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం కమిటీ సభ్యులు ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : క్యాబినెట్ భేటీలో ఆ రెండు అంశాలపై నిర్ణయముంటుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి