iDreamPost

చివరి నిమిషంలో మంత్రి వర్గంలోకి ఆదిమూలపు

చివరి నిమిషంలో మంత్రి వర్గంలోకి ఆదిమూలపు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హాట్ టాపిక్ గా మారింది. ముందు 90% మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి కేవలం 10 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ వైఎస్ జగన్ దానికి భిన్నంగా 10 మంది పాత మంత్రులను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరగా విడుదలైన లిస్టులో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లు కనిపించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరిలో ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది.

అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ పేరు ముందు విడుదలైన జాబితాలో కనిపించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరగడంతో ఆయన పేరు కూడా ఇప్పుడు జాబితాలో చేర్చబడింది. ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యునిగా ఉన్నారు. గతంలో రైల్వే శాఖలో అధికారిగా పనిచేసిన ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచిన ఆయన 2014లో సంతనూతలపాడు, 2019లో తిరిగి ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత మంత్రివర్గంలో ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన సేవలు ప్రభుత్వానికి వినియోగించుకోవాలని భావించిన వైఎస్ జగన్ చివరి నిమిషంలో ఆయన పేరు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. తిప్పేస్వామికి బదులుగా ఆదిమూలపు సురేష్ కి చోటు కల్పించారని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి