IPL 2024 Final: KKRపై సన్‌రైజర్స్‌ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే!

IPL 2024 Final: KKRపై సన్‌రైజర్స్‌ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే!

SRH vs KKR, IPL Final, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయింది. అయితే.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

SRH vs KKR, IPL Final, IPL 2024: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయింది. అయితే.. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు క్రికెట్‌ అభిమానుల గుండె ముక్కలైపోయే మ్యాచ్‌ ఆదివారం జరిగింది. ఐపీఎల్‌ 2024 ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దారుణమైన ఓటమిని చవిచూసింది. చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సారి కచ్చితంగా కప్పు కొడుతుందని భావించిన తరుణంలో చెత్త బ్యాటింగ్‌తో ఓడిపోయింది. ఇక ఈ ఫైనల్‌ విజయంతో ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా అవతరించింది కేకేఆర్‌. మూడో సారి ఆ జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. గతంలో 2012, 2014 సీజన్స్‌లో కూడా కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మూడో కప్పును ఖాతాలో వేసుకుంది. అయితే.. మరి ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి గత కారణాలు ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..

1. ఓపెనర్ల వైఫల్యం
ఈ సీజన్‌ ఆరంభం నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లపైనే చాలా ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ రన్స్‌ చేసినప్పుడు టీమ్‌ పరిస్థితి బాగానే ఉంటుంది. ఇద్దరిలో ఒకరు పరుగులు చేసినా ఓకే.. కానీ, ఇద్దరూ విఫలమైనప్పుడు మాత్రం సన్‌రైజర్స్‌ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పుడు కేకేఆర్‌తో జరిగిన ఫైనల్‌లోనూ జరిగింది ఇదే. అభిషేక్‌ శర్మ 2, ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌ అవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది.

2. చెత్త బ్యాటింగ్‌
ఓపెనర్లు విఫలం అయినా.. మిగతా బ్యాటర్లు కూడా పరిస్థితి తగ్గట్లు ఆడలేదు. మార్కరమ్‌ టైమ్ తీసుకుని ఆడినా.. 23 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన రాహుల్‌ త్రిపాఠి, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యారు. చెన్నై పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని అందరకీ తెలిసినా.. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఇక్కడ పేస్‌ బౌలింగ్‌కు కూడా ఎదుర్కొలేక చేతులెత్తేశారు.

3. ఒత్తిడి
ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అది సహజమే. ఈ ఒత్తిడిని కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌ లాంటి వాళ్లకు కొత్త కాకపోయినా.. టీమ్‌లోని యువ క్రికెటర్లు అభిషేక్‌ శర్మ, త్రిపాఠి, నితీష్‌ కుమార్‌రెడ్డి, షాబాజ్‌ అహ్మాద్‌, అబ్దుల్‌ సమద్‌ తట్టుకోలేకపోయారని అనిపిస్తుంది. బిగ్‌ మ్యాచ్‌కి ముందు వాళ్లను సరిగా ప్రిపేర్‌ చేస్తే బాగుండేది. కప్పు కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్‌ ఏ కొసనా కనిపించలేదు. ఎంత సేపు ఫేస్‌లో టెన్షన్‌ మాత్రమే కనిపించింది. అదే సన్‌రైజర్స్‌ కొంపముంచింది.

4. బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లో పాపం బౌలర్లను అనడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే.. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న టీమ్‌ ముందు 114 పరుగుల టార్గెట్‌ అంటే.. డిఫెండ్‌ చేసుకోవడం అంత సులువైన పని కాదు. అయినా.. కూడా కాస్త ప్రయత్నించి ఉండాల్సింది. పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తే బాగుండేది. చాలా సులువుగా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్‌ తన తొలి ఓవర్‌లో నరైన్‌ను అవుట్‌ చేసినా.. తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై ఎదురుదాడికి దిగాడు. అతని దూకుడు ముందు.. సన్‌రైజర్స్‌ బౌలర్లు సరెండర్‌ అయిపోయారు.

5. టాపార్డర్‌ విఫలం
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లలో ఒకరు విఫలమైనప్పుడు వన్‌డౌన్‌లో వచ్చే బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి కాస్త సమయస్ఫూర్తితో ఆడాల్సింది. తనకు అలవాటైన హిట్టింగ్‌కి అనవసరపు బ్యాడ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి.. విఫలం అవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో ఓ జట్టు టాపార్డర్‌లో కనీసం ఒక్కరైన క్రీజ్‌లో నిలబడి కొన్ని పరుగులు చేయడం చాలా ముఖ్యం. అది జరగకపోవడం సన్‌రైజర్స్‌కు కప్పు దూరం చేసింది. మరి ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణమైన ఈ 5 అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments