iDreamPost

కాంతార రివ్యూ..

  • Updated - 12:07 PM, Mon - 17 October 22
కాంతార రివ్యూ..

ఒక కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో గొప్పగా ఆడటం అనేది ఇన్ని దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో ఒక్క కెజిఎఫ్ తోనే మొదలయ్యింది. అంతకు ముందు రాజ్ కుమార్ తో పాటు ఆయన ఫ్యామిలీ హీరోలు, దర్శన్, సుదీప్ లాంటి పేరు మోసిన స్టార్లెవరూ ఇక్కడ కోలీవుడ్ స్టార్లలా ముద్ర వేయలేకపోయారు. అలాంటిది అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా ఒక విలేజ్ డ్రామా ఈ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం ఒక్క కాంతార విషయంలోనే కనిపిస్తోంది. మొదటి రోజు మార్నింగ్ షోకు జనం పెద్దగా లేని సీన్ నుంచి నిన్న ఆదివారం దాదాపు ఎక్కడా టికెట్లు దొరకని స్థితికి వెళ్ళింది. మరి అంతగా ప్రశంసలు అందుకుంటున్న కాంతారలో ఏముందో రివ్యూలో చూద్దాం

కథ..

అప్పుడెప్పుడో 18వ శతాబ్దంలో ఒక రాజు సిరిసంపదలు ఎన్ని ఉన్నా మనఃశాంతి లేక దాన్ని వెతుకుతూ అడవిలో దేవుడి రూపంలో ఉన్న ఓ శిలలో ఉందని తెలుసుకుని దాన్ని రాజ్యానికి తీసుకెళ్లాలని నిశ్చయించుకుంటాడు. దానికి బదులుగా అయిదు వందల ఎకరాల ఆ ప్రాంతాన్ని దాని మీదే ఆధారపడుతున్న తెగలకు ఇచ్చేస్తాడు. కాలక్రమేణా రాజుగారి వారసులు దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోతారు. వర్తమానంలో ఈ భూముల మీద కన్నేసిన దొర(అచ్యుతరాజు)కు, స్థానికంగా దైవనర్తకుల కులానికి చెందిన శివ(రిషబ్ శెట్టి)కు ఫారెస్ట్ ఆఫీసర్(కిషోర్)కు మధ్య దోబూచులాట మొదలవుతుంది. ఆ తర్వాత చూడాల్సింది చాలా ఉంది.

నటీనటులు..

రెగ్యులర్ కమర్షియల్ అనే పదానికి ఆమడదూరం పరిగెత్తే అరుదైన నటుల్లో రిషబ్ శెట్టి ఒకరు. అతని గత సినిమాలు చూసినా ఇదే అవగతమవుతుంది. చాలా రిస్క్ అనిపించే ఇలాంటి సబ్జెక్టునే ఎంచుకోవడమే కాక దర్శకత్వానికి కూడా సాహసించడం నిజంగా అభినందించదగ్గ విషయం. క్లైమాక్స్ ముందు వరకు ఈ పాత్రను ఎవరైనా చేస్తారనే ఫీలింగ్ కలుగుతుంది కానీ చివరి ఘట్టంలో ఇతగాడి విశ్వరూపం చూశాక ఈ యాక్టర్ కి నిజంగానే ఒంట్లో దైవం పూనాడా అన్నంత గొప్పగా పండించేశారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఇచ్చిన హావభావాలు నిశితంగా గమనిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మళ్ళీ ఇలాంటి పెర్ఫార్మన్స్ దొరుకుతుందో లేదో అన్నంతగా జీవించాడు

పేరుకి హీరోయినే కానీ సప్తమి గౌడ ఎలాంటి మేకప్ హంగులు లేకుండా చాలా సహజమైన లుక్స్ తో గార్డ్ కం శివ ప్రియురాలిగా తన పాత్రకు న్యాయం చేసింది. అటవీ శాఖ అధికారిగా కిషోర్ కు మంచి పాత్ర దక్కింది. సెటిల్డ్ యాక్టింగ్ తో నిలబెట్టారు. అచ్యుతరాజు ఎప్పటిలాగే తన అనుభవాన్ని హుందాతనాన్ని మేళవించి దొరగా అచ్చు గుద్దినట్టు సరిపోయారు. వీళ్ళు కాకుండా మిగిలిన మొహాలన్నీ టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం లేనివే. కాకపోతే సన్నివేశాల్లోని సహజత్వం, ఎలాంటి కృత్రిమత్వం లేని నటన ఆ ఫీలింగ్ రాకుండా చేశాయి. సాధారణంగా తమిళ డబ్బింగ్ సినిమాలు చూసేటప్పుడు కలిగే అసహజ భావన ఈ కాంతారకు ఎక్కడా కలగదు.

డైరెక్టర్ అండ్ టీమ్..

ఒక ప్రాంతానికే పరిమితమైన సంప్రదాయాలు, ఆచారాలను వేరొక రాష్ట్రం వాళ్లకు, సదరు భాషకు సంబంధం లేనివాళ్లకు కన్విన్స్ అయ్యేలా చూపించడం చాలా కష్టం. అందుకే తమిళనాడుకు చెందిన జల్లికట్టు, దేవరాట్టం లాంటివి మనకు అంతగా ఒంటబట్టలేదు. ఎక్కడిదాకో ఎందుకు తెలంగాణలో ఘనంగా సంబరంగా జరిగే బోనాలు ఆంధ్రాలో చూడం. అట్లతద్దె అంటే రాయలసీమ వాసులకు అంతగా అవగాహన లేదు. ఈ కాంతారలో చూపించిన దేవుడి వేషంతో దైవ నర్తకులు వేసే కోల నృత్య నేపథ్యంలోనూ ఇలాంటి సమస్య ఉంది. ఇది కూడా కర్ణాటక మొత్తం విస్తరించి ఉన్న పద్ధతి కాదు. కేవలం కొంత భాగానికే పరిమితమైన శతాబ్దాల నాటి నమ్మకం.

ఇంత సంక్లిష్టమైన నేపధ్యాన్ని తీసుకోవడమే దర్శకుడు రిషబ్ శెట్టి ఎంచుకున్న అతి పెద్ద మొదటి సవాల్. ఇందులో కథగా చెప్పుకుంటే మరీ అత్యద్భుతంగా మనమెప్పుడూ చూడలేదే అనిపించే విధంగా ఉండదు. ఆ మాటకొస్తే రంగస్థలంలో అన్న కుమార్ బాబుని ప్రెసిడెంట్ చంపితే తమ్ముడు చిట్టిబాబు ఆ నిజం తర్వాత ఆలస్యంగా తెలిసి చివరికి శత్రుసంహారం చేస్తాడు. ఈ కాంతారలో తమ్ముడు గురువాని దొర హత్య చేస్తే అన్న శివ క్లైమాక్స్ లో ఉగ్రరూపం దాల్చి వాడి అంతు చూస్తాడు. స్థూలంగా చెప్పుకుంటే కీలకమైన మెయిన్ పాయింట్ ఒకటే. కానీ కాంతారలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. రామ్ చరణ్ కోసమైనా సినిమా చూడొచ్చనే కారణాలు లేవు.

అందుకే రిషబ్ శెట్టి నిజాయితీని నమ్ముకున్నాడు. తను దగ్గరి నుండి చూసిన ఒక కులపు కట్టుబాట్లను పద్దతులను సినిమా ఫార్మాట్ లో ఆవిష్కరించడానికి కావాల్సిన కంటెంట్ ని జాగ్రత్తగా రాసుకున్నాడు. అలా అని టైటిల్ కార్డు నుంచి చివరి దాకా కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఏం లేదు. మధ్యలో ల్యాగ్ అనిపించే సీన్లున్నాయి. ఇలాంటివి బోలెడు చూశాం కదానే జోకులు, ఫైట్లు ఉన్నాయి. అబ్బ ఏం మలుపు తిప్పాడ్రా అనిపించే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు కూడా ఏం లేవు. ఆ మాటకొస్తే దొరనే విలనని అరగంటకే సగటు ప్రేక్షకుడికి ఈజీగా అర్థమైపోయింది. అరటిపండు ఒలిచినట్టు మొత్తం ఇంత ఓపెన్ గా ఉన్నప్పుడు ఆడియన్స్ ని కట్టిపడేయడం అంత సులభం కాదు.

రిషబ్ తీసుకున్న నేపథ్యంలో కొత్తదనం ఉంది. సాధారణంగా గ్రామాల్లో పూనకాలు రావడం, భవిష్యవాణి చెప్పడం, ఎవరికైనా రోగాలు వస్తే వేపమండలతో నయం చేయడం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతూనే ఉంది. అలాంటిదే ఈ కొళ కళ కూడా. తనను నమ్ముకున్న జనానికి ఏదైనా సమస్య వస్తే దేవుడు నేరుగా రాకపోయినా వాళ్ళు నమ్ముకున్న ఒకరి రూపంలో ఖచ్చితంగా వస్తాడనే సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూనే, అత్యాశకు పోయి అంతా నాకే కావాలనుకునే దురాశపరుల పతనం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం రిషబ్ బలంగా చేశారు. చివరి షాట్ లో దొరను చంపే సన్నివేశాన్ని రక్తపాతం లేకుండా కట్ చేయడం అతని ప్రతిభకు నిదర్శనం

ఒకవైపు చెట్లు పుట్టలున్న సంపదకు తాము రక్షకులమనే అటవిజాతి నమ్మకం, మరోవైపు దాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వ బాధ్యత ఈ
రెండు అంశాలను ఊళ్ళో బలాదూర్ గా తిరిగే యువకుడు, ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలను ప్రతినిధులుగా మార్చుకుని మలుచుకున్న తీరు బాగుంది. టెక్నికల్ గా కాంతారలో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. సాంకేతిక విభాగాలు నువ్వా నేనా అని పోటీ పడ్డాయి. విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా తక్కువ మోతాదులో వాడి కేవలం టేకింగ్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ని నమ్ముకుని రిషబ్ శెట్టి వీలైనంత వరకు కథనం గాడి తప్పకుండా ఉండేందుకు చూసుకున్నాడు. ఆ జాగ్రత్తే చాలా లోపాలను కప్పిపెట్టేసి దీన్నో క్లాసిక్ గా మార్చింది.

సమాజం ఎంత ఎదిగినా మనిషి ఎన్ని వందల వేల కోట్లకు అధిపతిగా మారినా అవన్నీ దైవబలం ముందు చిన్నవే. అందుకే ఎంత పెద్ద బిలియనీర్ అయినా సరే తిరుపతి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాడు కానీ ఓ ఐదు వందల కోట్లు ఇస్తా ఓసారి నావద్దకు స్వామివారిని తీసుకు రమ్మనే సాహసం చేయడు. ఆ భక్తి ప్రపత్తులే లోకాన్ని సర్వనాశనం కాకుండా కాపాడుతున్నాయన్న నమ్మకమే పాపభీతిని బ్రతికించి అంతోఇంతో మంచితనాన్ని నిలబెడుతున్నాయి. కాంతారలో ఈ అంశాన్ని అంతర్లీనంగా స్పృశిస్తూనే దైవధిక్కరణకు పాల్పడితే జరిగే పరిణామాలు కూడా చూపిస్తారు. మురారిలో కృష్ణవంశీ చెప్పాలనుకున్నది ఇంచుమించు ఇదేగా.కాకపోతే అందులో డ్రామా వేరు

అలా అని కాంతార అందరికీ తెగనచ్చేస్తుందన్న గ్యారెంటీ లేదు. కంప్లీట్ ఎంగేజింగ్ కంటెంట్ కోరుకునే వారికి ఈ సినిమా బోర్ కొట్టించే అవకాశం లేకపోలేదు. ఓవర్ రేటెడ్ గా పొగిడేస్తున్నారని ఫీలయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రజాస్వామ్య సూత్ర ప్రకారం మెజారిటీ పబ్లిక్ మెచ్చుకుని వసూళ్ల రూపంలో కలెక్షన్లు కురిపిస్తున్నప్పుడు నెంబర్ తక్కువగా కనిపించే ఆపోజిట్ బ్యాచ్ అభిప్రాయం నిలబడదు. కాంతారకు అదే జరుగుతోంది. ఈ కాంతారకు బలహీనత వన్ మీటర్ లో ఉంటే క్లైమాక్స్ ఇచ్చిన పాజిటివ్ ఇంపాక్ట్ హండ్రెడ్ మీటర్ లో వచ్చింది. అందుకే చివరి సీన్ అయ్యాక బయటికి వస్తున్నప్పుడు ఆ ట్రాన్స్ లోనే గొప్ప సినిమా చూశామన్న భావం కలుగుతుంది

అజనీష్ లోక్ నాధ్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రిషబ్ శెట్టి ఆలోచనలను పైస్థాయికి తీసుకెళ్లాడు. కొళ నృత్యం తాలూకు నేటివిటీని ఒడిసిపట్టి దానికి తగ్గట్టే ఇచ్చిన మ్యూజిక్ బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేందుకు దోహదపడింది. అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం కొన్ని కీలక ఘట్టాల్లో అత్యున్నత పనితనాన్ని చూపించింది. చీకటి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు సెట్ చేసుకున్న కలర్ స్కీం, ఫ్రేమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్ట్ వర్క్ సైతం పోటీ పడింది. హోంబాలే నిర్మాణ విలువలు, డబ్బింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ కాంతార లాంటి అడ్వెంచర్లు మరికొందరు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది

ప్లస్ గా అనిపించేవి: 

రిషబ్ శెట్టి నటన
క్లైమాక్స్ ఘట్టం
నేపధ్య సంగీతం
స్టోరీ బ్యాక్ డ్రాప్

మైనస్ గా తోచేవి:

మధ్యలో ల్యాగ్
గురువా పాత్ర పరిమితి
ఊహించగలిగే కథనం

కంక్లూజన్..

ప్రేక్షకులు థియేటర్ కు రావాలంటే ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. తాము పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరగాలంటే విజువల్ గా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇమ్మని కోరుతున్నారు. వాటిని నూటికి నూరు శాతం కాకపోయినా ఎనభై శాతం నెరవేర్చిన కాంతార అందుకే ఈ స్థాయిలో ఆడేస్తోంది. నగరాల్లో కథలు, ఆఫీసుల్లో పంచాయితీలు, మాఫియా దందాలే కాదు పట్టుమని పది వేల జనాభా లేని ఒక అటవీ ప్రాంతపు కథని మాసిపోయిన పంచె చొక్కాతో నడిపించే హీరోతో అయినా చూస్తామని మరోసారి సుస్పష్టంగా తీర్పిచ్చిన కాంతార ఆడియన్స్ కి ఓ కొత్త అనుభూతి అయితే అప్ కమింగ్ మేకర్స్ కి మాత్రం క్రియేటివిటీ కోణంలో సరికొత్త పాఠం. చూడాలి నేర్చుకోవాలి

ఒక్కమాటలో –  గెలిచెరా..

రేటింగ్ : 3 / 5